గూడు..గోడు

8 Feb, 2017 23:25 IST|Sakshi
గూడు..గోడు

– పేదలకు సొంతిళ్లు కలే!
– జిల్లా వ్యాప్తంగా ఒక్క ఇల్లూ పూర్తవని వైనం
– ఎన్టీఆర్‌ రూరల్, అర్బన్‌ హౌసింగ్‌ పరిస్థితి ఇదీ
– సమీక్షలతోనే సరిపెడుతున్న యంత్రాంగం
– లబ్ధిదారుల ఎంపికలోనూ రాజకీయం


సొంతిల్లు.. పేదోడి కల. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా అది ‘కల’గానే మిగిలిపోయింది. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. నాలుగు గోడల మధ్య సమీక్షలతోనే సరిపెడుతున్న జిల్లా యంత్రాంగం.. క్షేత్రస్థాయిలో  పునాదులు వేయించలేకపోతోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొత్తం ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో కొనసాగడంతో ఇళ్లకు రాజకీయ గ్రహణం పట్టుకుంది.

అనంతపురం టౌన్‌ :  జిల్లాలో పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తిగా పడకేసింది. ఎన్టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ కింద మంజూరైన ఇళ్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి. అనంతపురం, గుంతకల్లు నియోజకవర్గాలకు రెండు వేల చొప్పున, ధర్మవరానికి 1,400, రాయదుర్గానికి 1,307, హిందూపురానికి 500, కదిరికి వెయ్యి ఇళ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారుల ఎంపికను పూర్తిగా టీడీపీ ప్రజాప్రతినిధులే చేయడంతో చాలా ప్రాంతాల్లో అర్హులకు అన్యాయం జరిగింది. ఈ పథకం కింద మొత్తం 8,207 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయగా.. కలెక్టర్‌ కోన శశిధర్‌ 7,346 ఇళ్లకు పరిపాలనాపరమైన ఆమోదం తెలిపారు. ఇందులో 7,051 ఇళ్లు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. 295 ఇళ్లు గ్రౌండింగ్‌ అయ్యాయి. వీటిలోనూ 258 ఇంకా బేస్‌మెంట్‌ స్థాయికి కూడా చేరుకోలేదు. 37 ఇళ్లు (కదిరిలో 36, రాయదుర్గంలో ఒకటి) మాత్రమే బేస్‌మెంట్‌ స్థాయిలో ఉన్నాయి. హిందూపురం నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా మొదలుకాకపోవడం గమనార్హం.

రీ సర్వేకు కలెక్టర్‌ ఆదేశం
కొన్ని నియోజకవర్గాల్లో ‘ఎన్టీఆర్‌ అర్బన్‌’  ఇళ్లకు  రాజకీయ గ్రహణం పట్టుకుంది. దీని కారణంగానే అనంతపురంలో 557, గుంతకల్లు 103, హిందూపురంలో  200 ఇళ్లకు కలెక్టర్‌ కోన శశిధర్‌ పరిపాలనా అనుమతి ఇవ్వలేదు. అనంతపురం, హిందూపురం నుంచి వచ్చిన లబ్ధిదారుల జాబితాలో అనర్హులు ఉన్నారని ఫిర్యాదులు అందడంతో రీ సర్వేకు ఆదేశించారు. ఈ సర్వే పూర్తి చేసి కలెక్టర్‌కు మరోసారి ఫైల్‌ వెళితే మిగిలిన ఇళ్లకు అనుమతి లభించే అవకాశముంది.  

రూరల్‌దీ అదే పరిస్థితి
జిల్లాకు ఎన్టీఆర్‌ రూరల్‌ హౌసింగ్‌ కింద 17,400 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 13,840 ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే అనుమతి లభించింది. 11,695 ఇళ్లకు పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. తాడిపత్రి మినహా మిగిలిన 13 నియోజకవర్గాల్లోనూ లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు సంబంధించిన ఇళ్లకు జియోట్యాగింగ్‌ తప్పనిసరి. హౌసింగ్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (డీఈఈ) లాగిన్‌కు వెళ్లాలి. ఇప్పటి వరకు 12,483 ఇళ్లు లాగిన్‌ అవగా.. ట్యాగింగ్‌ చేసింది మాత్రం 5,749 ఇళ్లకే. అనుమతి లభించిన వాటిలో బేస్‌మెంట్‌ స్థాయికి చేరినవి 671 ఇళ్లే కావడం గమనార్హం.

సమీక్షలతో సరి
ఇళ్ల నిర్మాణాల విషయంలో గృహ నిర్మాణ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అధికారులు సమీక్షలు, టెలీకాన్ఫరెన్స్‌లతోనే సరిపెడుతున్నారు. ఎప్పుడు సమావేశం జరిగినా ఫలానా తేదీలోగా నిర్మాణాలు పూర్తి చేయాలి.. అని చెప్పడం మినహా చేతల్లో మాత్రం పురోగతి  లేదు.  

6,285 ఇళ్లకే ‘ఉపాధి’ అంచనాలు
ఎన్టీఆర్‌ రూరల్‌ హౌసింగ్‌ కింద ఇళ్ల నిర్మాణాలకు ఉపాధి హామీ పథకం నిధులతో అనుసంధానం చేశారు.  ఈ పథకం కింద విడుదలయ్యే నిధుల్లో 90 రోజుల పనికి గాను రోజుకు రూ.194 వేతనం చొప్పున కూలికి రూ.17,460, ఇటుకల తయారీకి రూ.25,540, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12,000 ఖర్చు చేసుకోవాల్సి ఉంది. జిల్లా మొత్తం రూరల్‌ హౌసింగ్‌ పథకం కింద కలెక్టర్‌ అనుమతి ఇచ్చిన 13,840 ఇళ్లలో ఇప్పటి వరకు 6,285 ఇళ్లకు మాత్రమే అంచనాలు ఇచ్చారు.

ఎన్టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌
నియోజకవర్గం    మంజూరు    కలెక్టర్‌ ఆమోదం     బేస్‌మెంట్‌లోపు..    బేస్‌మెంట్‌ స్థాయిలో..    ప్రారంభం కానివి    
అనంతపురం    2000        1443            9        0    1434    
గుంతకల్లు        2000    1897    41    0    1856    
ధర్మవరం        1400    1400    56    0    1344    
రాయదుర్గం    1307    1307    104    1    1202    
హిందూపురం    500    300    0    0    300    
కదిరి        1000    999    48    36    915    

ఎన్టీఆర్‌ రూరల్‌ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌  
నియోజకవర్గం    కేటాయించిన ఇళ్లు     మంజూరు    జియోట్యాగింగ్‌ అయినవి     బేస్‌మెంట్‌లోపు..    బేస్‌మెంట్‌ స్థాయిలో..
గుంతకల్లు        1250    1145    586    74    16    
శింగనమల    1250    968    280    15    6    
తాడిపత్రి        1250    1250    771    254    119    
ఉరవకొండ    1250    1155    162    3    0    
అనంతపురం    500    391    191    43    27    
ధర్మవరం        1250    1032    277    68    44    
కళ్యాణదుర్గం    1250    1097    428    134    47    
రాప్తాడు        1250    1174    621    178    118    
రాయదుర్గం    1250    1207    461    105    110    
హిందూపురం    1500    423    186    40    39    
కదిరి        1250    350    236    15    40    
మడకశిర        1250    350    408    101    26    
పెనుకొండ        1450    1259    448    69    47    
పుట్టపర్తి        1450    1218    694    65    32                            

మరిన్ని వార్తలు