కార్పొరేషన్‌ చుట్టూ ప్రదక్షిణలు

5 Aug, 2016 22:24 IST|Sakshi
కార్పొరేషన్‌ చుట్టూ ప్రదక్షిణలు
  • అధికారుల తీరుతో పేదల అవస్థ
  • ఇంటి కోసం రెండుసార్లు దర ఖాస్తుల స్వీకరణ
  •  గతంలో దరఖాస్తు చేసుకున్నా మరోసారి పత్రాలు
  •  
    నెల్లూరు సిటీ: పేదలకు సొంతింటిని సమకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అందరికీ ఇళ్లు పథకం’ కింద దరఖాస్తు చేసుకున్న పేదలకు కార్పొరేషన్‌ అధికారులు చుక్కలు చూపుతున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో ఖాళీ స్థలం కలిగి ఉండి ఇళ్లులేని వారు 5240 మంది, ఇంటి కోసం 38 వేల మంది ఆన్‌లైన్, మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆధార్, రేషన్‌కార్డు, ఫొటోలు, తదితర పత్రాలను ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేశారు. గత నెల 26 నుంచి కార్పొరేషన్‌ పరిధిలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు, మీ సేవలో దరఖాస్తు చేసుకున్న కాపీతో పాటు ఆన్‌లైన్లో అప్పట్లో అప్‌లోడ్‌ చేసిన పత్రాన్ని మరోసారి తీసుకురావాలని కార్పొరేషన్‌ అధికారులు పేర్కొన్నారు. దీంతో రోజుకు వెయ్యి మందికి చొప్పున ఫోన్లు చేసి కార్యాలయానికి పిలిపించారు. వారి నుంచి గతంలో అప్‌లోడ్‌ చేసిన పత్రాలను మళ్లీ స్వీకరించారు. 
    కూలీ పనులకు బ్రేక్‌..
    కూలీ పనులు చేసుకుంటే తప్ప పూట గడవని పేదలు సొంతిల్లు వస్తుందనే ఆశతో దరఖాస్తు చేసుకున్నారు. రోజూ పనులకు సైతం వెళ్లకుండా కార్పొరేషన్‌ కార్యాలయం చుట్టూ తిరిగారు. వందల సంఖ్యలో దరఖాస్తుదారులు కార్యాలయంలో క్యూ కట్టడంతో కూలీ పనులను మానుకొని రెండు రోజుల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. అధికారుల తీరుతో పేదలు జిరాక్స్‌ షాపుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. జిరాక్స్‌ల కోసం రూ.10 నుంచి రూ.20 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    అధికారుల సమన్వయలోపంతోనే..
    నగరపాలక సంస్థ అధికారుల సమన్వయలోపంతో పేదలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దరఖాస్తు చేసుకున్న వారి నుంచి మరోసారి పత్రాలను స్వీకరించాల్సిందిగా ఇటీవల జరిగిన సమావేశంలో మేయర్‌ ఆదేశించారు. ఈ క్రమంలో మెప్మా సూపరింటెండెంట్‌ సులోచన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు కార్పొరేషన్లో ఈ రకంగా జరగడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
     
    ఖాళీ స్థలాలు కలిగిన వారే పత్రాలతో రండి: వెంకటేశ్వర్లు, కమిషనర్‌
    నగరపాలక సంస్థ పరిధిలో ఖాళీ స్థలం కలిగి ఉండి ఇళ్లు లేని వారు మాత్రమే పట్టా రిజిస్ట్రేషన్‌ పత్రాన్ని తీసుకొచ్చి కార్పొరేషన్లో అధికారులకు ఇవ్వాలి. ప్రభుత్వ స్థలం కలిగిన వారికి పొజిషన్‌ సర్టిఫికెట్‌ను అందజేస్తాం. ఇంటికి దరఖాస్తు చేసుకున్న వారు కార్పొరేషన్‌కు రావాల్సిన అవసరం లేదు.
మరిన్ని వార్తలు