దోమలపై ఎన్ని దండగయాత్రలో..?!

2 Jun, 2017 03:08 IST|Sakshi
దోమలపై ఎన్ని దండగయాత్రలో..?!

మనుషులు.. దోమల మధ్య జరుగుతున్న యుద్దంలో దోమలే పైచేయి సాధిస్తున్నాయి. అధికారులు ఎప్పుడో ఓ సారి మేల్కొని మందులు, పొగతో అస్త్రాలు సిద్ధం చేసుకునేలోపు దోమలు వాటి సంతానాన్ని పదింతలు చేసుకుంటున్నాయి. దోమల నివారణకు ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలు ప్రజలు, అధికారుల మధ్య సమన్వ యలోపంతో నీరుగారిపోతున్నాయి. దోమలపై దండయాత్ర అంటూ
గతేడాది ఆరంభం అదిరిపోయేట్లు చేసి ఆపై కుంభకర్ణుడిలా నిద్రపో యిన అధికారులు ఈ సారి దోమల నివారణ నెల పేరిట మరో దండగ యాత్రకు సిద్ధమవుతున్నారు.


చిత్తూరు(అర్బన్‌): దోమల నిర్మూలన కార్యక్రమాలను అమలు చేసేందుకు రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా పంచాయతీలకు ఏటా రూ. 10వేల చొప్పున విడుదలవుతోంది. గ్రామ సర్పంచ్‌ ఆధ్వర్యంలో నడిచే పారిశుద్ధ్య కమిటీ సమావేశమై ఈ నిధులను దోమల నిర్మూలన కోసం ఖర్చు పెట్టాలి. కానీ 2వేల లోపు జనాభా ఉండే గ్రామాల్లో ఒకసారి దోమల నివారణ చేపట్టేందుకు కూలీలకు, మందుల కొనుగోలుకు రూ. 15వేల వరకు ఖర్చు అవుతోంది. ఈ నిధులను కూడా విత్‌డ్రా చేసేందుకు చాలా చోట్ల పంచాయతీ కార్యదర్శి,  ఏఎన్‌ఎంలు ముందుకు రావడం లేదు. ఇక మేజర్‌ పంచాయతీలకు సైతం రూ.10వేలే ఇవ్వడంతో ఏ మూలకూ సరిపోవడంలేదు. మేజర్‌ పంచాయతీల్లో ఒకసారి దోమల మందు పిచికారి చేయాలంటే కనీసం రూ.25వేల వరకు ఖర్చు అవుతోంది. సీజన్‌లో నాలుగుసార్లు దోమల మందు పిచికారి చేయాలంటే రూ.లక్ష నిధులు అవసరం. పైగా ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, వైద్యశాఖ అధికారుల మధ్య సమన్వయంలేకపోడం కూడా దోమల ఉత్పత్తికి పెరగడానికి ప్రధాన కారణమవుతోంది.

పట్టణాల్లో దారుణం
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో పారిశుద్ధ్య నిర్వహణ దారుణంగా తయారైంది. చిత్తూరు, తిరుపతి లాంటి నగరాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధమని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ అధికారులు ఓడీఎఫ్‌ను సైతం ప్రకటించారు. అయినా సరే మురికి వాడల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేక ప్రజలు బహిర్భూమిని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లలైతే మురిగునీటి కాలువల్లోనే తమ కాలకృత్యాలు తీర్చుకోవడం దోమల ఉత్పత్తికి కారణంగా నిలుస్తోంది. మదనపల్లె మున్సిపాలిటీ, చిత్తూరు కార్పొరేషన్‌ నీటి సమస్య ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఒకేసారి వారానికి సరిపడ నీటిని నిల్వ చేసుకుంటున్నారు. ఫలితంగా నిల్వ నీటి నుంచి దోమల ఉత్పత్తి పెరుగుతోంది.

మరిన్ని వార్తలు