ఉల్లంఘనలెన్ని?

5 Apr, 2016 03:44 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా :  జీఓ 111 అమలులో ఉన్న ప్రాం తంలో 83 గ్రామాలున్నాయి. అయితే ఈ జీఓను కాలరాస్తూ కొందరు భారీ కట్టడాలు, నిర్మాణాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించారు. దీంతో జలాశయాలు కుంచించుకుపోతుండగా.. వాటి మనుగడ క్రమంగా ప్రశ్నార్థకమవుతోం ది. ఈక్రమంలో కొందరు పర్యావరణ కార్యకర్తలు జీఓ 111 ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్‌జీటీ (నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్)ను ఆశ్రయిం చారు.

దీంతో స్పందించిన ఎన్‌జీటీ అక్ర మ నిర్మాణాలు, వాణిజ్య సముదాయాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా యం త్రాంగాన్ని ఆదేశించింది. దీంతో చర్యలు చేపట్టిన అధికారులు 83 గ్రామాల్లో ప్ర త్యేక బృందాలను నియమించారు. ప్రతి బృందంలో గ్రామ రెవె న్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ సహాయకులు సభ్యులుగా ఉంటారు. ఈ బృందాలను మం డల తహసీల్దార్, ఉప తహసీల్దార్, విస్తరణ అధికారి (ఈఓ పీఆర్ అండ్ ఆర్‌డీ) సమన్వయపరుస్తారు. మొత్తం గా ఈ బృందాలు ఈనెల 12లోపు జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలికి నివేదిక సమర్పిం చాల్సి ఉంటుంది.

 మూడు నమూనాల్లో వివరాల సేకరణ..
నిబంధనల ఉల్లంఘనలను క్షేత్రస్థాయిలో సమీక్షించి వివరాలను ఎన్‌జీటీకి అందించేందుకు జిల్లా యంత్రాంగం మూడు ప్రొఫార్మాలను రూపొం దించింది. మొదటి నమూనాలో నిర్మాణాల తీరు, రెండో నమూనాలో అక్రమ, అనధికారిక లేఅవుట్లు, మూడో నమూనాలో అక్రమ, అనధికారిక నిర్మాణాలున్న లేఅవుట్ల వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ప్రతి నమూనాలో ఎనిమిది కాలాలకు సంబంధించి సమాచారం తీసుకోవాల్సిందిగా క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టం చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్‌లో జీఓ 111 పరిధిలోకి వచ్చే మండలాల తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, ఈఓ పీఆర్‌డీలతో కలెక్టర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నిర్ణీత ప్రొఫార్మా ప్రకారం సమాచారాన్ని సేకరించి ఈనెల 12లోగా సమర్పించాలని ఆయన  సూచించారు.

మరిన్ని వార్తలు