పుష్కరాలపై మరింత ప్రచారం

15 Aug, 2016 18:56 IST|Sakshi
పుష్కరాలపై మరింత ప్రచారం
రంగంలోకి దిగిన సీఆర్‌డీఏ
జాతీయ రహదారులపై స్వాగతబోర్డులు
రూ.25 లక్షలతో ఏర్పాటు
 
మంగళగిరి: పుష్కరాలకు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆర్భాటంగా ప్రచారం నిర్వహించినా ప్రభుత్వ పెద్దలు అనుకున్న స్థాయిలో ప్రజల నుంచి స్పందన కొరవడడంతో మరింత ప్రచారానికి ప్రజాధనాన్ని వృ«థా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సెలవు రోజులైన శని, ఆదివారాలలోను పుష్కరాలకు ఆశించిన స్థాయిలో జనస్పందన కనిపించలేదు. దీంతో రానున్న రోజుల్లో ప్రజల నుంచి స్పందన కరువవుతుందని భావించిన ప్రభుత్వ పెద్దలు సీఆర్‌డీఏ(రాజధాని ప్రాధికారిక అభివృద్ధి సంస్థ) పేరుతో స్వాగతద్వారాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు ఆదివారం జాతీయ రహదారిపై ద్వారాలను ఏర్పాటు పనులు ప్రారంభించారు. విజయవాడకు చేరుకునే జాతీయ రహదారుల వెంట సుమారు నాలుగు వందల ద్వారాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఒక్కో ద్వారం ఖర్చు రూ.40 వేలకు పైగా అవుతోంది. మొత్తం ద్వారాలకు  సుమారు రూ.25 లక్షల ప్రజాధనం వృధా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  పుష్కరాలు ప్రారంభమైన మూడు రోజుల తర్వాత జాతీయ రహదారులపై స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయాలని సీఆర్‌డీఏ అధికారులకు ఎందుకు ఆసక్తి కలిగిందో అంతుచిక్కడం లేదు. ఇప్పటికే అవసరం లేని చోట్ల, నీరు లేని చోట్ల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ఘాట్‌లు నిర్మించి విమర్శలపాలయిన ప్రభుత్వం మాత్రం ప్రచారంలో వెనక్కి తగ్గకపోవడం విశేషం.  గుంటూరు, మచిలీపట్నం, ఏలూరు, హైదరాబాద్‌ల నుంచి విజయవాడకు చేరుకునే రహదారులలో ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు.
 
>
మరిన్ని వార్తలు