మానవీయ కోణంలో

1 Oct, 2016 23:42 IST|Sakshi
మానవీయ కోణంలో
నిజామాబాద్‌ నాగారం:
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల విభజన సందర్భంగా వారి మనోభావాలు దెబ్బ తీయకుండా విభజన చేపట్టాలని టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్‌ కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్‌ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 3,434 పోస్టులు ఉండగా, 1134 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులకు ఆప్షన్‌ ఇవ్వాలని, భర్త ఎక్కడ ఉంటే భార్యకు అదే జిల్లాలో విధులు నిర్వహించేలా చూడాలని కోరారు. పదవీ విరమణకు దగ్గరలో ఉన్న ఉద్యోగులను ఇదే జిల్లాలో కొనసాగించేలా చూడాలని కోరారు. కొత్త జిల్లాలో ఉద్యోగులందరికీ 20శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలన్నారు. జిల్లాలో టీఎన్జీవోఎస్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించున్నట్లు చెప్పారు. కామారెడ్డి జిల్లాకు వెళ్లబోయే ఉద్యోగులకు త్వరలోనే ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. స.హ. చట్టం పేరుతో కొందరు ఉద్యోగులను అనవసరంగా బెదిరిస్తున్నారని, ఇలాంటివి సహించేది లేదన్నారు. ఉద్యోగులు అందరు బంగారు తెలంగాణ కోసం పనిచేస్తున్నారని అన్నారు. టీఎన్జీవోస్‌ జిల్లా కార్యదర్శి సతీష్‌రెడ్డి, నేతలు దయానంద్, అమృత్‌కుమార్, నరేందర్, సుధాకర్, నరహరి తదితరులు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు