'అత్తార్‌'కు అడుగడుగునా అవమానాలు!

14 Nov, 2016 22:55 IST|Sakshi
'అత్తార్‌'కు అడుగడుగునా అవమానాలు!
  • డబ్బుకు అమ్ముడు పోయిన మీరా మమ్మల్ని చైతన్య పరిచేది?
  • మా గ్రామానికి మీరు రానవసరం లేదన్న గొడ్డువెలగల ప్రజలు
  • ప్రొటోకాల్‌పై ఎమ్మెల్యేని నిలదీసిన టీడీపీ సర్పంచ్‌
  • కదిరి : పార్టీ ఫిరాయించిన కదిరి ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషాకు నియోజకవర్గంలో అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. రెండు రోజుల క్రితం కదిరి మండలం బూరుగు పల్లి గ్రామస్తులు ‘ఒక పార్టీ సింబల్‌తో గెలిచి మరో పార్టీలోకి జంప్‌ అయిన మీరా మమ్మల్ని చైతన్యం చేసేది? మీలాంటి వారికి మా గ్రామంలోకి అనుమతి లేదు’ అంటూ ఫ్లెక్సీ ద్వారా తమ నిరసనను తెలిపారు. తాజాగా సోమవారం గాండ్లపెంట మండలం గొడ్డువెలగల పంచాయతీ పరిధిలోని ప్రతి గ్రామం వద్ద ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ‘ఓట్లేసి గెలిపించిన ప్రజలను మీరు మోసగించారు. డబ్బుకు కక్కుర్తి పడి మీరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. జన చైతన్య యాత్రల పేరుతో మీరు జనాన్ని చైతన్యం చేయడమేంటి? ప్రజలను మోసగించిన మీ లాంటి వారిని మా గ్రామంలోకి అనుమతించం’ అంటూ గొడ్డువెలగల గ్రామ ప్రజల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

    ఎమ్మెల్యేను నిలదీసిన టీడీపీ సర్పంచ్‌

    ప్రొటోకాల్‌ విషయంలో ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషాను టీడీపీకి చెందిన గొడ్డువెలగల సర్పంచ్‌ ప్రసాద్‌ నిలదీశారు. ’కదిరి వ్యవసాయ మార్కెట్‌ యార్డు కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ ఆహ్వాన పత్రికలో మీ ఫొటో వేయలేదని నానా యాగీ చేసి ఆఖరుకు కార్యక్రమాన్నే రద్దు చేయించారు. మరి ఈరోజు మీరు జనచైతన్య యాత్రల పేరుతో మా గ్రామానికి వచ్చారు. సమావేశం దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో గ్రామ సర్పంచ్‌ ఫొటో వేయాలని మీకు తెలీదా?’ అని ప్రశ్నించారు. అంతకు మునుపు ఆయన పోలీసులతో కూడా ఇదే విషయంపై మాట్లాడారు. 

    పోలీసుల రక్షణతో గ్రామాల్లోకి ..

    పార్టీ మారిన తన పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ముందే ఊహించిన ఎమ్మెల్యే భారీ పోలీస్‌ బంద్‌బస్త్‌తో జనచైతన్య యాత్రల పేరుతో గ్రామాల్లోకి వెళ్తున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలను పోలీసులు ముందే వెళ్లి వాటిని తొలగించి, అక్కడ పరిస్థితిని చక్కబెట్టిన మీదటే ఎమ్మెల్యే గ్రామాల్లోకి అడుగుపెడుతున్నారు. ఎన్పీ కుంట మండలం గొల్లపల్లి మహిళలు తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఖాళీ బిందెలతో నిరసన తెలియజేసిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు