జీజీహెచ్‌లో ‘జనన’ పత్రాలకు తంటా

2 Oct, 2016 21:21 IST|Sakshi
ఒకే ఒక పత్రం ఇచ్చారని చెబుతున్న వ్యక్తి
*  జనన ధ్రువపత్రాల జారీలో నిర్లక్ష్య ధోరణి
ప్రచారం ఘనం.. అమలు శూన్యం
జీజీహెచ్‌ అధికారుల తీరుపై విమర్శల వెల్లువ
 
బిడ్డ పుట్టిన 24 గంటల్లో ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్, జనన సర్టిఫికెట్‌ జారీ అంటూ ఒక పక్క ప్రచారాలతో ఊదరగొడుతున్నా.. అమలు విషయంలో మాత్రం లబ్ధిదారులకు వీటి కోసం నెలల తరబడి పడిగాపులు తప్పుడం లేదు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో అధికారుల, సిబ్బంది నిర్లక్ష్యం రోగులకు శాపంగా మారింది. 
 
గుంటూరు మెడికల్‌: గుంటూరు నగరంలోని అమరావతిరోడ్డుకు చెందిన ముక్కా రాజేశ్వరి సెప్టెంబర్‌ 21న జీజీహెచ్‌లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమె ఇంటికి వెళుతున్న సమయంలో పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సర్టిఫికెట్లను ఆసుపత్రి అధికారులు ఇవ్వకపోవడంతో శనివారం ఆమె సోదరుడు కల్లవరపు రాజేంద్ర సర్టిఫికెట్‌ కోసం ఆసుపత్రికి వచ్చాడు. ఆసుపత్రిలోని జనన, మరణ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సంప్రదించగా.. పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ అందజేసి, ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సర్టిఫికెట్‌ను బయట చేయించుకోవాలని చెప్పి చేతులు  దులుపుకున్నారు. అదే విధంగా రాజేంద్రనగర్‌కు చెందిన కట్టమూరి కృష్ణమూర్తి సెప్టెంబర్‌ 1న జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అతని మరణ ధృవీకరణ పత్రాన్ని తక్షణమే ఇవ్వాల్సి ఉండగా, సంబంధిత సిబ్బంది, అధికారులు ఇవ్వకపోవడంతో శనివారం కృష్ణమూర్తి కుటుంబసభ్యులు సర్టిఫికెట్‌ కోసం ఆసుపత్రికి వచ్చారు. నెలరోజులు అయినప్పటికీ మరణ ధృవీకరణ పత్రాన్ని సిద్ధం చేయలేదు. పైగా దరఖాస్తు చేసుకుని నెలరోజుల తరువాత వస్తే అందిస్తామని చెప్పడంతో సిబ్బంది తీరును విమర్శిస్తూ  కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లిపోయారు. ఇలా ప్రతిరోజూ గుంటూరు జీజీహెచ్‌లో జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం లబ్ధిదారులకు పడిగాపులు తప్పడం లేదు. 
 
రోల్‌ మోడల్‌ ఆస్పత్రిలోనే...
రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు జీజీహెచ్‌ను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మే 1 నుంచి జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్‌ సర్టిఫికెట్ల కార్యక్రమాన్ని జీజీహెచ్‌లో లాంచనంగా ప్రారంభించింది. ఆసుపత్రిలో పుట్టిన 24 గంటల వ్యవధిలో పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంతోపాటు, ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నెంబరును కూడా లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. కానీ జీజీహెచ్‌లో కాన్పు జరిగి ఇంటికి వెళ్లిన తరువాత వారంరోజులు ఆగి వస్తే సర్టిఫికెట్‌ ఇస్తామంటూ బాలింతలను, వారి కుటుంబ సభ్యులను సంబంధిత సిబ్బంది అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
 
ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ బయటేనంటా..!
పుట్టిన తేదీ సర్టిఫికెట్లలో ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ఇవ్వకుండా బయట చేయించుకోవాల్సిందేనంటూ పంపించి వేస్తున్నారు. మరణ ధృవీకరణ పత్రాల మంజూరు కూడా ఆలస్యంగానే జరుగుతోంది. గత నెలలో మరణిస్తే,  ధృవీకరణ పత్రం నెలరోజులు గడిచినా ఇవ్వడం లేదని కొందరు ఆందోళన కూడా చేశారు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు, సిబ్బంది 24 గంటల్లో మంజూరు చేయాల్సిన సర్టిఫికెట్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తుండటంతో ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి సకాలంలో సర్టిఫికెట్లు మంజూరు అయ్యేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.
మరిన్ని వార్తలు