భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు

22 Sep, 2016 21:02 IST|Sakshi
భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు
మచిలీపట్నం :
భార్యను నరికి చంపిన కేసులో భర్తపై నేరం రుజువు కావటంతో జీవిత ఖైదు విధిస్తూ పదో అదనపు జిల్లా స్పెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి జి.స్వర్ణలత గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. బంటుమిల్లి మండలం రామవరపుమోడి గ్రామానికి చెందిన బొల్లా నాగమల్లేశ్వరరావుకు, బందరు మండలం చినకరగ్రహారానికి చెందిన భూలక్ష్మికి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి పాప, బాబు ఉన్నారు. నాగమల్లేశ్వరరావు కొబ్బరిబొండాల వ్యాపారం చేసేవాడు. కొంత కాలం పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. భార్యపై అనుమానం పెంచుకున్న నాగమల్లేశ్వరరావు తరచూ ఆమెతో గొడవ పడేవాడు. భర్త వేధింపులు భరించలేని భూలక్ష్మి పుట్టింటికి వచ్చి ఉంటోంది. నాగమల్లేశ్వరరావు పెద్దల సమక్షంలో భూలక్ష్మిని జాగ్రత్తగా చూసుకుంటానని హామీ ఇచ్చి కరగ్రహారంలో ఆమెతో కలిసి ఉంటున్న నేపథ్యంలో 2014 సెప్టెంబర్‌ 14వ తేదీన భార్యతో గొడవ పడ్డాడు. ఆమెను జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకువచ్చి కొబ్బరిబొండాలు నరికే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భూలక్ష్మి మరణించింది. మృతురాలి సోదరుడు పరిసే శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు మచిలీపట్నం తాలుకా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావటంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు