రెప్పలు లేని కను‘పాపలు’

1 Jul, 2016 03:32 IST|Sakshi
రెప్పలు లేని కను‘పాపలు’

తండ్రి చేతిలో తల్లి హతం
 ఆత్మహత్య చేసుకున్న తండ్రి  
 పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చిన ఘటన

 
 తన కడుపు మాడ్చుకుని..పిల్లల కడుపు నింపే తల్లి..పిల్లల కాలిలో ముల్లు గుచ్చుకుంటే తన గుండెల్లో గునపం దిగినంత బాధ పడే తండ్రి ఆ చిన్నారులకు లేకుండా పోయారు. అమ్మకొంగు పట్టుకుని మారాం చేస్తూ..నాన్న భుజాలెక్కి అటాడుకునే వయసులో   దురదృష్టవంతులైన పసిపిల్లలకు ఆ సరదాలు తీరే పరిస్థితి లేకుండా పోయింది. బతిమాలి బుజ్జగించి అన్నం తినిపించే అమ్మ..ఎన్ని కష్టాలైనా పడి అడిగినవన్నీ కొనిచ్చే తండ్రి ఆ చిన్నారులకు శాశ్వతంగా దూరమయ్యారు.  ఆడపిల్లలుగా పుట్టడమే మా పాపమా? ఈ లోకంలోకి మమ్మల్ని తీసుకువచ్చి కంటికి రెప్పలా..మా బాగోగులు చూడాల్సిన మీరు..మమ్మల్ని ఒంటరిగా వదిలి దూరతీరాలకు పోయారా? అని ప్రశ్నించే వయసు   ఆ పిల్లలకు లేదు.  తల్లిదండ్రులు కనిపించక..తమను ఎవరు       సాకుతారో తెలియక ఆ చిన్నారి పాపలు బిక్కమొహాలతో చూస్తుంటే విషయం తెలుసుకున్న చూపరుల హృదయాలు చెమ్మగిల్లుతున్నాయి.

 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం: తమను నిత్యం అందంగా ముస్తాబు చేసి గోరుముద్దలు తినిపించే  అమ్మను నాన్నే కిరాతకంగా హత్య చేశాడని..పశ్చాత్తాపంతో తానూ ఆత్మహత్య చేసుకున్నాడని తెలియని ఆ పసిపాపలు తల్లి దండ్రులు ఎటు వెళ్లారో..?ఎప్పటికి వస్తారో తెలియక నిత్యం ఎదురు చూస్తున్నారు.  హత్య, ఆత్మహత్యలతో తల్లిదండ్రులు దూరమైతే అభం శుభం ఎరుగని చిన్నారుల జీవితాలు ఏం కావాలి?    తమను సాకేవారెవరూ లేక..తెలిసీ తెలియని వయసులో మౌనంగా రోదిస్తున్న ఈ చిన్నారుల భవితవ్యం సమాధానం లేని ప్రశ్నగా మిగిలి పోవాల్సిందేనా?
 
 తల్లిని హత్య చేసిన తండ్రి  
 వేపాడ మండలం చినగుడిపాల  గ్రామానికి చెందిన గజ్జి కృష్ణతో లక్కవరపుకోట మండలం ఖాసాపేట గ్రామానికి చెందిన లక్ష్మికి  ఆరేళ్ల క్రితం వివాహమయ్యింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. నిన్ను చేసుకోవడం వల్ల ఆడపిల్లలు జన్మించారని, మరొకర్ని పెళ్లిచేసుకుంటే  మగపిల్లలు పుట్టి ఉండేవారని  లక్ష్మితో భర్త కృష్ణ తరచూ గొడవ పడేవాడు. ఈ  క్రమంలో భార్యభర్తల మధ్య గొడవలు తీవ్రమవడంతో కొన్నాళ్లు దూరంగా ఉన్నారు.

ఆ తర్వాత పోలీసు స్టేషన్‌లో కౌన్సెలింగ్, పెద్దల జోక్యంతో కలిశారు.  జూన్ 1వ తేదీనుంచి విజయనగరం పట్టణాన్ని ఆనుకుని ఉన్న బియ్యాలపేట పంచాయతీలోని  ప్రసాద్‌నగర్‌లో ఎలుబండి రాజబాబు ఇంట్లో ఈ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఎప్పటిలాగే, జూన్ 13వ తేదీ రాత్రి భార్యాభర్తలు భోజనాలు చేసి తొమ్మిది గంటల వరకు ఇంటి  బయట కూర్చుని నిద్రించడానికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో భార్య లక్ష్మిని కృష్ణ అతికిరాతకంగా హతమార్చి అక్కడి నుంచి పరారయ్యాడు.  
 
 ఒడిశాలో సజీవ దహనమైన తండ్రి
 భర్త..భార్యను హతమార్చిన ఘటనపై విజయనగరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న కృష్ణ కోసం సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా అన్వేషణ మొదలు పెట్టారు. అయినా కృష్ణ ఆచూకీ దొరకలేదు. కానీ, జూన్ 20వ తేదీన మాత్రం విశాఖపట్నం జిల్లా ఆనందపురంలో ఉన్న తన బావకు కృష్ణ ఫోన్ చేశాడు. పోలీసులు దీన్ని పసిగట్టారు. కాల్‌డేటా ఆధారంగా ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.
 
 ఈ క్రమంలోఆ ఫోన్‌కాల్ ఒడిశా రాష్ట్రంలోని కొరాఫుట్ నుంచి వచ్చిందని తేలింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ త్రినాథరావు, కానిస్టేబుల్ షఫీ ఒక బృందంగా ఏర్పడి, నిందితుడు కృష్ణ తమ్ము డ్ని పట్టుకుని జూన్ 24వ తేదీన కొరాఫుట్ వెళ్లారు. తొలి రోజు కొరాఫుట్ అంతా వెదికినా ఎక్కడా కన్పించలేదు. కానీ, మరుసటి రోజైన 25న కొరాఫుట్ పోలీసులకు ఒకచోట గుర్తు తెలియని మృతదేహం కన్పించింది. అప్పటికే ఒడిశా పోలీసులతో జిల్లా పోలీసు బృందం టచ్‌లో ఉండడంతో గుర్తు తెలియని మృతదేహం విషయమై సమాచారం అందింది. ఈ మేరకు జిల్లా పోలీసులు అక్కడికెళ్లి    మృతదేహం జేబులో ఉన్న సెల్‌ఫోన్, వేసుకున్న దుస్తులు ఆధారంగా కృష్ణ మృతదేహమని ఆయన తమ్ముడితో కలిసి గుర్తించారు.
 
  అధికారికంగా ధ్రువీకరించేందుకు గాను బరంపురం తరలించిన మృతదేహం తొడ ఎముకలను డీఎన్‌ఏ పరీక్షకు సేకరించారు. వాటిని శుక్రవారం డీఎన్‌ఏ ల్యాబ్‌కు పంపించేందుకు విజయనగరం రూరల్ సీఐ రవికుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి వస్తాడనుకున్న తండ్రి కూడా సజీవదహనం కావడంతో ఆ పిల్లలు ఎటూ కాకుండా పోయారు.     
 
 అనాథలైన పిల్లలు..
 ఆ ఇద్దరు ఆడపిల్లలకు నాలుగేళ్ల లోపు వయస్సు వారే. ప్రస్తుతం వారి భవిష్యత్తేంటో తెలియని పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులిద్దరూ లేక రోడ్డున పడ్డారు.  ప్రస్తుతానికైతే లక్కవరపుకోట మండలంలోని ఖాసాపేటలో ఉన్న అమ్మమ్మ  సంరక్షణలో ఉన్నారు. వారెంతకాలం చూడగలరు..వారి భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. అనాథలైన పిల్లలను  స్వచ్ఛందసంస్ధలు, సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తులు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.  
 

మరిన్ని వార్తలు