భార్యను హత్య చేసిన భర్త

22 Oct, 2016 01:09 IST|Sakshi
భార్యను హత్య చేసిన భర్త
చింతలపూడి : అనుమానం పెనుభూతమైంది. ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఇద్దరు చిన్నారులను దిక్కులేనివారిని చేసింది.  అనుమానంతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. శుక్రవారం చింతలపూడి మండలం ఊటసముద్రంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.గ్రామస్తుల కథనం ప్రకారం ఖమ్మం జిల్లా మారెప్పగూడెం గ్రామానికి చెందిన జగదీశ్వరి(30)కి ఊటసముద్రం గ్రామానికి చెందిన రంగు లక్ష్మణరావుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి తొమ్మిదేళ్ల కుమార్తె మానస, ఏడేళ్ల కుమారుడు చరణ్‌ ఉన్నారు. వీరు అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కూలీనాలి చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటున్న జగదీశ్వరి, లక్ష్మణరావు మధ్య మూడేళ్ల క్రితం మనస్పర్థలు పొడసూపాయి.  భార్యపై అనుమానంతో లక్ష్మణరావు తరచూ ఆమెను వేధిస్తుండటం మొదలెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య కలహాలు పెరిగాయి. ఫలితంగా జగదీశ్వరి పుట్టింటికి వెళ్లిపోయింది. వారం  క్రితం పెద్దలు ఇద్దరికీ రాజీ చేసి గ్రామానికి తీసుకువచ్చారు. గురువారం రాత్రి  లక్ష్మణరావు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఏడు గంటలకు భార్యను అత్యంత దారుణంగా గొడ్డలితో మెడపై నరికి హత్యచేశాడు. ఆ తర్వాత తన భార్యను హత్యచేశానని, పోలీసులకు లొంగిపోవడానికి వెళ్తున్నానని గ్రామస్తులకు చెప్పి పరారయ్యాడు. చింతలపూడి ఇన్‌చార్జ్‌ సీఐ జి.శ్రీనివాస్, ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ కె.నాగేంద్ర ప్రసాద్‌  ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. లక్ష్మణరావు కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. వీఆర్‌వో జి.పుల్లారావు ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.  జగదీశ్వరి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. తల్లి హత్యకు గురికావడం, తండ్రి కనిపించకుండా పోవడంతో పిల్లలు దిక్కులేనివారయ్యారు. వీరి ఆలనాపాలన ఇక ఎవరు చూస్తారని వృద్ధురాలైన వారి నాయనమ్మ రంగు ధనలక్ష్మి రోదించారు. తల్లి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండడంతో బేల చూపులు చూస్తూ.. అమాయకంగా అటూఇటూ తిరుగుతున్న పిల్లలను చూసి గ్రామస్తులు కంటతడిపెట్టారు. 
 
మరిన్ని వార్తలు