'రాయితో కొట్టి భార్యను చంపేశాడు'

2 Sep, 2015 18:48 IST|Sakshi
'రాయితో కొట్టి భార్యను చంపేశాడు'

ముదిగొండ (ఖమ్మం): అనుమానం పెనుభూతమై ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఖమ్మం జిల్లాలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలు.. ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామానికి చెందిన రాపోలు శ్రీను, కృష్ణవేణి (24) దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే, శ్రీను తరచూ భార్యను అనుమానిస్తూ వేధిస్తున్నాడు. గత నెల 26న ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా భార్యను రాయితో బలంగా మోదటంతో ఆమె తలపై గాయమైంది.


తీవ్ర రక్తస్రావం కావటంతో వెంటనే శ్రీను ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యుల సూచన మేరకు భార్యను వరంగల్ ఎంజీఎంకు తరలించాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. తరచూ తన కుమార్తెను అనుమానించేవాడని, అదే కారణంతో ఆమెను కొట్టి చంపాడని శ్రీనుపై కృష్ణవేణి తండ్రి సంపంగి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాములుది నల్లగొండ జిల్లా అనుముల గ్రామం. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు