కట్టుకున్నోడే కాలయముడై..

2 Sep, 2016 00:15 IST|Sakshi
 
కొవ్వూరు : కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. భార్యను కిరాతకంగా నరికి చంపాడు. అడ్డువచ్చిన అత్తపైనా దాడిచేశాడు. ఆ తర్వాత అదే కత్తితో పీకకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొవ్వూరులో గురువారం జరిగిన ఈ దారుణ ఘటన సంచలనం సృష్టించింది. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కలవపాడుకుS చెందిన బొదంకి నరసింహమూర్తి  కొవ్వూరుకు చెందిన వరలక్ష్మి(30)ని పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ తరుచూ గొడవలు పడుతుండడంతో పలుమార్లు పెద్దలు రాజీ చేశారు. బంటా కూలీగా పనిచేసే నరసింహమూర్తి ఏడాది క్రితమే సెట్రింగ్‌ పనుల నిమిత్తం ఉపాధి కోసం కుటుంబ సమేతంగా హైదరాబాద్‌ వెళ్లాడు. రెండు నెలల క్రితం భార్యాభర్తలు గొడవ పడడంతో వరలక్ష్మి కొవ్వూరులోని పుట్టింటికి వచ్చేసింది. నెల రోజుల క్రితం మళ్లీ పెద్దలు సర్ది చెప్పడంతో కాపురానికి వెళ్లింది. అయినా వీరిద్దరి మధ్య సక్యత కుదరలేదు. భర్తతో విసుగెత్తిన వరలక్ష్మి పదిరోజుల క్రితమే ఆమె కుతూరు, చిన్న కుమారుడిని తీసుకుని కొవ్వూరు వచ్చింది. వరలక్ష్మి పెద్ద కుమారుడు కొంతకాలంగా కొవ్వూరులోనే ఉంటున్నాడు. గురువారం కొవ్వూరులోని 19వ వార్డు దగ్గువారి వీధిలోకి వచ్చిన నరసింహమూర్తి వరలక్ష్మిని పిలిచి గొడవపడ్డాడు. మాటామాటా పెరగడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడ్డాడు. వరలక్ష్మి అరుపులు విని ఆమె తల్లి మాచారపు అచ్చాయమ్మ బయటికి వచ్చి అల్లుడిని అడ్డుకునేందుకు యత్నించింది. దీంతో నరసింహమూర్తి ఆమెపైనా విచక్షణరహితంగా దాడి చేశాడు. అదే కత్తితో పీకకోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కత్తితో నరసింహమూర్తి దాడికి పాల్పడుతున్న సమయంలో చుట్టు పక్కల జనం నిచ్చేష్టులై ఉండిపోయారు. భయంతో అతడిని అడ్డుకునే సాహసం చేయలేకపోయారు. దీంతో రక్తపు మడుగులో రోడ్డుపైనే  పడిపోయిన వరలక్ష్మి పక్కనే నరసింహమూర్తి కుప్పకూలి పడిపోయాడు. స్థానికులు వీరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొన ఊపిరితో ఉన్న వరలక్ష్మిని, పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో నరసింహమూర్తిని 108లో రాజమండ్రి తరలించారు. మార్గమధ్యలో  వరలక్ష్మి మరణించింది. నరసింహమూర్తి రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అచ్చాయమ్మ చికిత్స పొందుతున్నారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎస్‌ఐ పవన్‌కుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  
 
మరిన్ని వార్తలు