భార్య కళ్లముందే భర్త జలసమాధి

24 Sep, 2016 21:45 IST|Sakshi
భార్య కళ్లముందే భర్త జలసమాధి
 
కీసర (కంచికచర్ల) :
కుటుంబ తగాలతో ఓ వ్యక్తి బ్రిడ్జిపై నుంచి మున్నేటిలో దూకి గల్లంతయిన సంఘటన కంచికచర్ల మండలం కీసరలో శనివారం చోటు చేసుకుంది. నందిగామ మండలం ఐతవరంకు చెందిన వేముల కోటేశ్వరరావు(45) అనే వ్యక్తి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మధ్యాహ్న సమయంలో డ్యూటీ దిగి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో భార్య పద్మతో వివాదం జరిగింది. తరువాత ఇద్దరూ ఏదో పనిపై ఆటో ఎక్కి కంచికచర్ల వైపు వచ్చారు. మార్గమధ్యలో ఉన్న కీసర మున్నేటి బ్రిడ్జి వద్ద ఆటోను దిగారు. అక్కడే కోటేశ్వరరావు మున్నేటిలో దూకే ప్రయత్నం చేయగా భార్య అడ్డుతగిలింది. అయినా ఆమెను విదిలించుకుని మున్నేటిలోకి దూకాడు. ఆమె కేకలు వేయడంతో కొందరు వాహనదారులు పరిశీలించగా అప్పటికే నీటిలో కొట్టుకుపోయాడు. కళ్లముందే భర్త జలసమాధి కావడంతో భార్య షాక్‌కు గురైంది. 
ఉన్నతాధికారి పరిశీలన 
 తహశీల్దార్‌ ఎన్‌ విజయకుమార్, నందిగామ ఎస్‌ఐ తులసీ రామకృష్ణ, కంచికచర్ల ఏఎస్‌ఐ పిళ్లా సుబ్రహ్మణ్యం, నందిగామ ఫైర్‌ సిబ్బంది ç చేరుకుని విచారించారు. భార్య నుంచి వివరాలు సేకరించారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్, సబ్‌ కలెక్టర్‌కు సమాచారం అందించానని మున్నేటిలో గల్లంతయిన కోటేశ్వరరావును వెదికేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలను రప్పిస్తామని చెప్పారు. 
 
మరిన్ని వార్తలు