మరో మహిళపై మోజు..

27 Apr, 2016 04:39 IST|Sakshi
మరో మహిళపై మోజు..

భార్యను బెల్టుతో ఉరివేసి చంపిన భర్త
జవహర్‌నగర్‌లో ఘటన
మృతురాలు వరంగల్ జిల్లావాసి 

 జవహర్‌నగర్:  మరో మహిళపై మోజుతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను బెల్టుతో మెడకు ఉరివేసి చంపేశాడు. ఏడడుగులు నడిచి అగ్నిసాక్షిగా మనువాడిన వాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన జవహర్‌నగర్‌లోని మార్వాడీలైన్‌లో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ నర్సింహారావు, స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని మల్కాపూర్ గ్రామానికి చెందిన రాజేష్ 2009 మే 9న ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన గౌతమి(25)ని వివాహం చేసుకున్నాడు.

పెళ్లి సమయంలో గౌతమి తల్లిదండ్రులు రూ. 2.5 లక్షలతో పాటు ఇతర సామగ్రి కట్నంగా ఇచ్చారు. దంపతులకు 5 ఏళ్ల కూతురు వర్షిక ఉంది. బతుకుదెరువు కోసం సికింద్రాబాద్‌లోని అడ్డగుట్టకు వలస వచ్చారు. రాజేష్ ఓ ప్రింటింగ్‌ప్రెస్‌లో పనిచేస్తుండగా గౌతమి సికింద్రాబాద్‌లోని టెలీనార్ స్టోర్‌లో పనిచేస్తూ కుటుంబానికి సాయంగా ఉంది. 6 నెలల క్రితం దంపతులు జవహర్‌నగర్‌లోని మార్వాడీలైన్‌లో ఓ ఇల్లు కొనుగోలు చేసి ఇక్కడికి తమ మకాం మార్చారు. కుటుంబ కలహాలతో దంపతులు రెండేళ్లుగా గొడవపడుతున్నారు. పలుమార్లు ఇరువర్గాలకు చెందిన పెద్దలు పంచాయితీ పెట్టి భార్యాభర్తలకు సర్దిచెప్పారు.

 మరో అమ్మాయిపై మోజు..
రాజేష్ కొంతకాలంగా వేరే అమ్మాయితో సెలఫోన్లో మాట్లాడుతూ ఆమెతో చనువుగా ఉండసాగాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడుతున్నాడని గౌతమి తన తల్లిదండ్రులకు పలుమార్లు ఫిర్యాదు చేసింది. ఈనేపథ్యంలో ఇటీవల గొడవలు మరింత ముదిరాయి. అయినా రాజేష్ ప్రవర్తనలో మార్పురాలేదు. మంగళవారం రాత్రి ఈవిషయంలో భార్యాభర్తలు ఘర్షణపడ్డారు. అర్ధరాత్రి సమయంలో రాజేష్ గౌతమి మెడకు బెల్ట్‌తో ఉరిబిగించి చంపేశాడు. మంగళవారం తెల్లవారుజామున గౌతమి ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులకు తెలిపిన రాజేష్ జవహర్‌నగర్ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

శామీర్‌పేట తహసీల్దార్ రవీందర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. జవహర్‌నగర్ సీఐ నర్సింహరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనుమానంతో రాజేష్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా క్షణికావేశానికి గురై గౌతమిని బెల్ట్‌తో గొంతుకు ఉరిబిగించి హత్య చేశానని అంగీకరించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించడంతో స్వగ్రామానికి తీసుకెళ్లారు.

 అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లీ..
పట్నంబోయి బాగా బతుకుతానంటివి బిడ్డా.. అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా.. బిడ్డా అంటూ గౌతమి తండ్రి  బెల్లం బీరయ్య బోరున విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పట్నంలో ఇల్లు కొనుక్కొని మంచిగా బతుకుతున్నారేమోననకున్నాను.. పాపను మాకిచ్చి నువ్వు వెళ్లిపోతివా.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

మరిన్ని వార్తలు