భార్యను హత్య చేసిన భర్త రిమాండ్

30 Jun, 2016 01:35 IST|Sakshi
భార్యను హత్య చేసిన భర్త రిమాండ్

వరకట్నం కోసమే ..
చేతి రుమాలుతో గొంతు బిగించిన ఘనుడు
నేరాన్ని అంగీకరించిన నిందితుడు

నర్సాపూర్‌రూరల్: భార్యను హత్య చేసిన భర్తను సంగారెడ్డి సమీపంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకొని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, నర్సాపూర్ సీఐ తిరుపతిరాజు తెలిపారు. బుధవారం నర్సాపూర్ పోలీ స్టేషన్‌లో వివరాలను వెల్లడించారు. ఈనెల 24న సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి చౌరస్తాకు చెందిన నీరుడి బాలకృష్ణ తన భార్య నవీన అలియాస్ సంతోష(23)ను పథకం ప్రకారం ఇక్కడికి తీసుకువచ్చి చేతి రుమాల్‌తో మెడకు ఉరి వేసి ప్రాణం తీశాడు. అదే గ్రామానికి చెందిన జవాన్ నర్సింహ్మా తన కూతురుకు, మేనల్లుడైన నీరుడి బాలకృష్ణకు నాలుగేళ్ళ క్రితం పెళ్లి చేశాడు. వివాహ సమయంలో పదిన్నర తులాల బంగారం, రూ. 5 లక్షల నగ దు, ఇతర సామగ్రిని ఇచ్చి వివాహం జరిపించాడు.

వీరికి అక్షర (3) సం తానం. పాప పుట్టినప్పటి నుంచి అదనపు కట్నం కోసం బాలకృష్ణ తండ్రి మల్లేశం, తల్లి సుగుణ, అతడి ఇద్దరు చెల్లెళ్లు జ్యోతి, బేబీ షాలినిలు సంతోషను వేధించేవారు. ఈ క్రమంలో ఆటో కోసం రూ. 3 లక్షలు కావాలని బా లకృష్ణ డిమాండ్ చేయడంతో ఆమె నిరాకరించి తల్లిగారింటికి వెళ్లింది. దీంతో ఈ నెల 24న భార్య పుట్టింటికి వెళ్లిన భర్త మాయమాటలు చెప్పి ఆమెను బయటకు తీసుకువచ్చాడు. సాయంత్రం 7 గంటల సమయంలో మందు బాటిల్, తినుబండారాలు, వాటర్ ప్యాకెట్లు తీసుకొని బీవీఆర్‌ఐటీ సమీపంలోని బీడు పొలాల్లోకి వెళ్లి అక్కడ మద్యం సేవిస్తూ భార్యకు కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా ఉన్నట్టుండి తాను వేసుకున్న పథకం ప్రకారం చేతి రుమాల్‌తో ఆమె మెడకు గట్టిగా బిగించి ప్రాణాలు తీశాడు.

సంతోష ఒంటిపై ఉన్న రెండున్నర తులాల పుస్తెలతాడును తీసుకొని పరారయ్యాడు. ఆపై 25న ఉదయం మామ నర్సింహతో కలిసి సంగారెడ్డి రూరల్ పోలీస్టేషన్‌కు వెళ్లి సంతోష కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఈలోగా బీవీఆర్‌ఐటీ సమీపంలో గుర్తుతెలియని శవం లభించడం, దానిని పోలీసులు మృతురాలి తండ్రికి చూపించడం, కేసు దర్యాప్తు చేయడంతో మిస్టరీ వీడింది. నేరాన్ని అంగీకరించడంతో బాలకృష్ణను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. అతడితో పాటు కట్నం కోసం వేధించిన అతని తండ్రి మల్లేశం, తల్లి సుగుణ, చెల్లెలు జ్యోతి, బేబీ షాలినిలను సైతం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాండు , రాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు