ఆకలి మెడలో ఆహారం

9 Sep, 2016 21:19 IST|Sakshi
ఆకలి మెడలో ఆహారం

నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేందుకు సైతం నోచుకోని నిర్భాగ్యుల కోసం ఏర్పాౖటెందే హైదరాబాద్‌ ఫుడ్‌ బ్యాంక్‌. అదే సమయంలో తిండి ‘కొన’లేని వారికి, ఆహారాన్ని వృథా చేస్తున్న వారికి మధ్య వారధిగా నిలుస్తోంది ఈ సంస్థ. మీకు అవసరం లేని ఆహారం కనీసం మరో ఐదు కడుపులు నింపేందుకు పనికొస్తే.. అంతకు మించి మీకు కావాల్సిందేముంటుంది? అనే ప్రశ్నతో ఆలోచన రేకెత్తిస్తోందీ సంస్థ.

అయితే మీరు దానమిచ్చే ఆహారం పరిశుభ్రంగా ఉండేలా చూడమని సూచిస్తోంది. ఇంట్లో తయారైన ఆహారాన్ని మాత్రమే సేకరించి పంపిణీ చేస్తామంటున్నారు వీరు. అవసరమైన వారికి డబ్బు ఇవ్వడం కన్నా నాణ్యమైన ఆహారం అందించడమే సరైందిగా భావిస్తామంటున్నారు.                                  - సాక్షి, వీకెండ్‌ ప్రతినిధి

ఐదుగురు స్నేహితుల ఆలోచన...
అబ్దుల్‌ అజీజ్, దిలీప్, ఇక్బాల్, సత్య, అబ్దుల్‌ సలాం... అనే ఐదుగురు స్నేహితుల ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ఈ ఫుడ్‌ బ్యాంక్‌ గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 8700కి Sపైగా మంది ఫేస్‌బుక్‌ పేజీలో వీరికి బాసటగా నిలుస్తున్నారు. కనీసం 60 మంది చురుకైన వలంటీర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మొదటి ఫుడ్‌ డ్రైవ్‌లో కేవలం 34 ప్యాకెట్ల ఆహారం మాత్రమే సేకరించి అందించగలిగారు. అదే ఇప్పుడు ఒక్కో ఫుడ్‌ డ్రైవ్‌కి సగటున 500కు పైనే అవసరార్థులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు.

బంజారాహిల్స్, హిమాయత్‌నగర్, రాణిగంజ్, అత్తాపూర్, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్, కూకట్‌పల్లి, తార్నాక, శ్రీనగర్‌కాలనీ, ఈస్ట్‌ మారేడ్‌పల్లి, బేగంపేట, హెచ్‌ఎంటీ నగర్, మలేసియన్‌ టౌన్‌షిప్, సోమాజిగూడ, శివం రోడ్, పద్మారావునగర్, ఉప్పల్, నాంపల్లి ప్రాంతాల నుంచి ప్రస్తుతం ఆహారం సేకరిస్తున్నారు. విదేశాల నుంచి కొందరు బ్రెడ్, బిస్కట్స్, లస్సీ ప్యాకెట్స్‌... వగైరాలను ఆర్డర్‌ చేసి కొరియర్‌ ద్వారా వీరికి పంపిస్తున్నారు. వీరు పొరపాటున కూడా డబ్బును స్వీకరిం చరు. వృద్ధులు, నిరాశ్రయులు, వికలాంగులు, ఫుట్‌పాత్‌ల మీద నివసించే వారికి ఈ ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు.

లక్ష్యం.. హంగర్‌ ఫ్రీ సిటీ
వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు, గృహిణులు, విద్యార్థులు ఈ బృందంలో ఉన్నారు. హైదరాబాద్‌ని హంగర్‌ ఫ్రీ సిటీ (ఆకలి ఛాయల్లేని నగరం)గా మార్చాలనేదే తమ లక్ష్యం అంటున్నారు వీరు. ప్రస్తుతం ప్రతి ఆదివారం మాత్రమే తమ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న వీరు.. భవిష్యత్తులో వారానికి మూడు రోజులు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఒక్కో సమయంలో ఆహారం లభిస్తున్నా సరిపడా వలంటీర్లు లేకపోవడంతో సేకరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే ఒక్కోసారి అనూహ్యంగా భారీ పరిమాణంలో లభిస్తున్న ఆహారాన్ని తీసుకెళ్లడం కూడా కష్టమవుతోందన్నారు. ‘మరింత మంది చురుకైన వలంటీర్ల కోసం చూస్తున్నాం. మాకు ఎవరైనా ఆహారం అందించాలనుకుంటే ఇంట్లో వండిన ఆహార పదార్ధాలు, అవీ తాజాగా ఉన్నవి మాత్రమే చక్కగా ప్యాక్‌ చేసి అందించాల’ని కోరుతున్నారు. స్థానికంగా ఉన్న కో–ఆర్డినేటర్‌కు అందించడం మాత్రమే కాకుండా అవి పంపిణీ చేసే సమయంలో ఆసక్తి ఉంటే తమతో కలిసి రావచ్చునని చెప్పారు.

ఆహారం అందించండి... ఆదుకోండి
వరల్డ్‌ హంగర్‌ డే సందర్భంగా ఒకే రోజున 4050 మందికి ఆహారం పంపిణీ చేయడం తాము చేసిన కార్యక్రమాల్లో అతి పెద్దదని చెప్పారు. అదే విధంగా చిల్డ్రన్‌ ఫుడ్‌ డ్రైవ్‌ కూడా చేపట్టామన్నారు. ఇండిపెండెన్స్‌ డే, రిపబ్లిక్‌ డే, పండుగల సందర్భంగా కూడా ప్రత్యేకమైన ఫుడ్‌ డ్రైవ్‌లు చేపడుతున్నామని చెప్పారు. వృథా అయిందే కాకపోయినా.. వారంలో ఒక రోజు సాంబారన్నం లేదా వెజిటబుల్‌ రైస్, పోహ, పండ్లు, ఇడ్లీలు, దోసెలు... ఇలా ఏదైనా సరే వండి చక్కగా ప్యాక్‌ చేసి స్థానికంగా ఉన్న కో–ఆర్డినేటర్‌కి అందించాలని కోరారు. సేకరించిన ఆహారాన్ని ఏదో ఒక వాహనంలో తీసుకెళ్లి అవసరార్థులకు అందజేస్తామన్నారు.

ఆహారం అందించాలి అనుకున్నా,
గ్రూప్‌లో జాయిన్‌ కావాలన్నా ఈ నంబర్లలో సంప్రదించండి

9160508054, 9700524806

 

హైదరాబాద్ పుడ్ బ్యాంక్ సంస్థ గ్రూపు సభ్యులు

>
మరిన్ని వార్తలు