ఇంకా చిక్కని ఆచూకీ?

27 Jun, 2013 18:32 IST|Sakshi
ఇంకా చిక్కని ఆచూకీ?

సాక్షి, సిటీబ్యూరో: కదిలిస్తే కన్నీళ్లు.. ఆత్మీయులు గుర్తుకొస్తే గుండెచెరువు.. ఎదురుచూసి.. చూసీ కళ్లలో నీళ్లింకిపోతున్నాయి.. ఎంతకీ చిక్కని ఆచూకీ తీరని వేదనను, కన్నీటి వరదను సృష్టిస్తోంది. నగరం నుంచి చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన 822 మంది యాత్రికుల్లో ఇంకా 153 మంది ఆచూకీ లభించలేదు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి అందిన సమాచారం మేరకు యాత్రికుల్లో 471 మంది నగరానికి ఇప్పటికే చేరుకున్నారు. 198 మంది తాము క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందించారని అధికారులు తెలిపారు. అయితే ఇంకా 57 మందికి సంబంధించి ఎటువంటి సమాచారం లభించలేదు. వీరితో పాటు మరో 96 మంది యాత్రికుల సెల్‌ఫోన్లకు వారం రోజులుగా ఫోన్ చేస్తున్నా ఎటువంటి స్పందనలేదు. దీంతో ఇప్పటికీ ఆచూకీ చిక్కని వారిని 153 మందిగా గుర్తించారు.

మరో 105 మంది రాక..
ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకొని డెహ్రాడూన్‌కు చేరిన 105 మంది తెలుగువారు బుధవారం జెట్ ఎయిర్‌వేస్ ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. వీరందరినీ నగరంలోని స్వస్థలాలకు పంపేందుకు హైదరాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేసింది. ‘ఎటు చూసినా వ రద.. రోజుల తరబడి ఎడతెరిపిలేని వర్షాలతో అంతా జలమయమైంది. తిండి, నీళ్లు లేక వారం రోజులు అల్లాడాం.

దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న తమకు తెలుగు వారు కనిపించే సరికి ప్రాణాలు లేచివచ్చాయి’ అని పలువురు చార్‌ధామ్ యాత్రికులు తమను చూసి సంతోషపడ్డారని, వారికి సాయమందించే అవకాశం లభించడం తృప్తినిచ్చిందని, హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వెళ్లిన ఓ రెవెన్యూ అధికారి బుధవారం‘సాక్షి’తో చెప్పారు. బాధితులకు ప్రకృతి విపత్తు నిర్వహణ అథారిటీ ద్వారా డెహ్రాడూన్‌లో వైద్య పరీక్షలు, పౌష్టికాహారం, ఒక్కొక్కరికి ఉచిత ఫ్లైట్ టికెట్, రూ.5000 నగదును అందించినట్లు అధికారులు తెలిపారు.

శంషాబాద్‌లో రెవెన్యూ ప్రత్యేక ఏర్పాట్లు
చార్‌ధామ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న నగరవాసులను ఆదుకోవాల్సిన హైదరాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో వారం రోజులుగా చలనం లేదు. జిల్లా యంత్రాంగం తీరుపై నగరవాసుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రిజ్వీ, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది ఎట్టకేలకు స్పందించారు. ముగ్గురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో మూడు బృందాలు శంషాబాద్ విమానాశ్రయం వద్ద పనిచేసేలా చర్యలు చేపట్టారు. యాత్రికుల తక్షణావసరాలను తీర్చేందుకు సరిపడా ఆహారం, మంచినీరు, మందులు, రవాణా కోసం బస్సులు, కార్లు సమకూర్చారు. జిల్లా కలెక్టర్ రిజ్వీ, జాయింట్ కలెక్టర్ శ్రీధర్ కూడా శంషాబాద్ వెళ్లి చార్‌ధామ్ నుంచి తిరిగి వచ్చిన యాత్రికులను పరామర్శించారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా