డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుంటే జైలుకే..

30 Jan, 2017 23:37 IST|Sakshi
డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుంటే జైలుకే..

కనీసం రెండు రోజులైనా తప్పనట్లే...
న్యాయ విభాగంతో పోలీసుల భేటీ
నగరంలోని స్థితిగతులపై వివరణ
నేటి నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహణ



సాక్షి, సిటీబ్యూరో: డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా దూసుకుపోదాం...ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకుంటే రూ.వందో, రూ.రెండొందలో ఇచ్చి వచ్చేద్దాం...అనుకుంటున్నారా? ఇకపై అలా కుదరదు. మంగళవారం నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా చిక్కితే వారిపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. కోర్టులు కనీసం రెండు రోజుల జైలుశిక్ష విధించనున్నాయి. సోమవారం నగర ట్రాఫిక్‌ పోలీసులు– న్యాయ విభాగం మధ్య జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంఎస్‌జే రాధారాణి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో నగరంలోని ట్రాఫిక్‌ కోర్టుల న్యాయమూర్తులు, ట్రాఫిక్‌ విభాగం అధికారులు పాల్గొన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు సంబంధించి మంగళవారం నుంచి ఆర్టీఏ అధికారులతో కలిసి ఆటోలు, ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక డ్రైవ్‌ చేయనున్నట్లు డీసీపీ ఏవీ రంగనాథ్‌ పేర్కొన్నారు.

ఇదీ నగరంలోని సీన్‌...
గత ఏడాది ఆఖరి నాటికి నగరంలోని వాహనాల సంఖ్య 50 లక్షలు దాటింది. అయితే సిటీలో ఉన్న డ్రైవింగ్‌ లైసెన్సుల సంఖ్య 20 లక్షలకు మించట్లేదు. మొత్తం వాహనాల్లో టూ వీలర్స్‌ సంఖ్య 45 లక్షల వరకు ఉండగా... ఈ తరహా లైసెన్సులు కేవలం 10 లక్షలే జారీ అయ్యాయి. మరోపక్క గత ఏడాది ప్రమాదాల్లో మృతుల సంఖ్య 371గా ఉండగా... వీరిలో 190 మంది వరకు ద్విచక్ర వాహనచోదకులే ఉన్నారు. వీరిలో 80 శాతం మందికి డ్రైవింగ్‌ లైసెన్సులు లేకుండానే వాహనాలతో రోడ్లపైకి వచ్చి మృత్యువాతపడ్డారు. ఈ గణాంకాలను న్యాయ విభాగానికి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించిన ట్రాఫిక్‌ విభాగం అధికారులు సిటీలోని పరిస్థితుల్ని కళ్లకు కట్టారు. మరోపక్క గత నెల 22న పాతబస్తీలోని షంషేర్‌గంజ్‌ ప్రాంతంలో ఓ ఆటో జంగయ్య ప్రాణాలు తీసింది. శనివారం తాడ్‌బంద్‌ చౌరస్తా ప్రాంతంలో జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదం ఇద్దరు విద్యార్థుల్ని బలిగొంది. ఈ రెండు ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లకు లైసెన్స్‌ లేదు. యాక్సిడెంట్స్‌ వీడియోలను న్యాయమూర్తులకు చూపించిన ట్రాఫిక్‌ పోలీసులు వాస్తవాలను వారి దృష్టికి తీసుకువెళ్ళారు.

విదేశాల్లో అయితే ఇలా...
నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై ఏడాదిన్నరగా అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. వీరికి న్యాయస్థానాలు రూ.1000 వరకు జరిమానాలు విధిస్తున్నాయి. లైసెన్స్‌ లేని వాహనచోదకులపై ఇతర దేశాల్లో తీసుకుంటున్న చర్యల్నీ ఈ సమావేశంలో చర్చించారు. అమెరికా, దుబాయ్‌ల్లో ఇలా చిక్కిన వారు విదేశీయులైతే వారిని స్వదేశాలకు బలవంతంగా తిప్పిపంపుతారు. జరిమానాలు సైతం 10 వేల నుంచి 20 వేల డాలర్లు, ఏడాది నుంచి రెండేళ్ళ వరకు జైలు శిక్షలు విధిస్తారు. భారత మోటారు వాహనాల చట్టం ప్రకారమూ డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడుపుతూ చిక్కిన వారికి గరిష్టంగా మూడు నెలల జైలు శిక్ష విధించే ఆస్కారం ఉంది.

ఈ వివరాలను న్యాయ విభాగానికి వివరించిన ట్రాఫిక్‌ పోలీసులు మంగళవారం నుంచి ఇలాంటి వాహనచోదకులకు కనీసం రెండు రోజుల జైలు శిక్ష విధించాలని కోరారు. దీనికి న్యాయమూర్తులు అంగీకరించారని డీసీపీ ఏవీ రంగనాథ్‌ పేర్కొన్నారు. కాగా జైలుశిక్ష పడిన వారి వివరాలు ఆధార్‌ సంఖ్యతో సహా డేటాబేస్‌ ఏర్పాటు చేస్తామంటున్నారు. పాస్‌పోర్ట్, వీసాలతో పాటు ప్రభుత్వ, కొన్ని ఇతర ఉద్యోగాలకు పోలీసు వెరిఫికేషన్‌ తప్పనిసరి. కాబట్టి వాహనదారులు జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ వెరిఫికేషన్‌ నివేదికతో పాటు డేటాబేస్‌లో సరిచూడటం ద్వారా సదరు వ్యక్తికి ఈ శిక్ష పడిందని పోలీసులు సంబంధిత శాఖకు నివేదించనున్నారు. దీని ఆధారంగా జైలుకు వెళ్ళిన ఉల్లంఘనులకు పాస్‌పోర్ట్, వీసా, ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

లెర్నింగ్‌ లైసెన్స్‌తో కుదరదు
‘సిటీలో అనేక మంది వాహనచోదకులు లెర్నింగ్‌ లైసెన్స్‌ తీసుకుంటున్నారు. దీన్ని దగ్గర పెట్టుకుని ఎవరికి వారు వాహనాలు నడుపుతూ రోడ్లపైకి వస్తున్నారు. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం. లెర్నింగ్‌ లైసెన్స్‌ కలిగిన వ్యక్తి తనంతట తానుగా వాహనం నడుపకూడదు. ఓ వ్యాలిడ్‌ లైసెన్స్‌ కలిగిన వారి పర్యవేక్షణలోనే నడపాలి. ద్విచక్ర వాహనమైతే లెర్నింగ్‌ లైసెన్స్‌ కలిగిన వారి వెనుక, తేలికపాటి వాహనమైతే ఆ వాహనంలో వ్యాలిడ్‌ లైసెన్స్‌ హోల్డర్‌ ఉండాల్సింది. లెర్నింగ్‌ లైసెన్స్‌ కలిగిన వారి వాహనాలకు కచ్చితంగా ‘ఎల్‌’ బోర్డ్‌ ఉండాలి. వీటిలో ఏది లేకపోయినా అది లైసెన్స్‌ లేకుండా వాహనం నడపటంతో సమానమే’. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్‌ డీసీపీ

మరిన్ని వార్తలు