ఎస్పీ వద్ద మనసులో మాట చెప్పిన హిజ్రా

7 Jul, 2016 20:33 IST|Sakshi
ఎస్పీ వద్ద మనసులో మాట చెప్పిన హిజ్రా

సారూ.. ఎస్‌ఐ కావాలనుంది..!
 - ఎస్పీ రవికృష్ణను కోరిన హిజ్రా మాధురి


నంద్యాల: ‘సారూ.. నాకు ఎస్‌ఐ కావాలనుంది, సాయం చేయండి’ అని   మాధురి అనే హీజ్రా జిల్లా ఎస్పీ రవికృష్ణను కోరింది. దీనిపై ఆయన స్పందిస్తూ ఎస్‌ఐ సెలక్షన్లకు కోచింగ్ ఇప్పిస్తానని, పుస్తకాలు అందజేస్తానని చెప్పారు. నేత్రదానం కార్యక్రమంలో భాగంగా ఎస్పీ బుధవారం నంద్యాలలోని మహానంది రస్తా పాత కేసీ కెనాల్ భవన సముదాయంలో ఉన్న సమతా హిజ్రాల సంఘం కార్యాలయాన్ని సందర్శించారు.
 
 ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ నందికొట్కూరు తాలూకా విపనగండ్ల గ్రామానికి చెందిన తాను డిగ్రీ వరకు చదివానని చెప్పారు. తర్వాత ఎంకాం చేయడంకోసం ఆర్‌యూ పీజీ సెట్ లో మంచి ర్యాంకు తెచ్చుకున్నా హిజ్రా అనే కారణంతో సీటు నిరాకరించారంటూ కన్నీరు పెట్టుకుంది. విషయంపై ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డిని కలిసినా ప్రయోజనం లేకపోయిందన్నారు.
 
 ఈ ఏడాది మేలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన రాత పరీక్షకు హాజరైనట్లు చెప్పింది. హిజ్రాలకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నష్టపోతున్నట్లు చెప్పింది. తమిళనాడులో ఓ హిజ్రా ఎస్‌ఐ పోస్టుకు ఎంపికైందని, తాను కూడా అలా కావాలని చెప్పింది. దీనిపై ఎస్పీ రవికృష్ణ స్పందిస్తూ తమిళనాడులో హిజ్రా.. మహిళల కోటాలో ఎస్‌ఐ పోస్టు సాధించినట్లు చెప్పారు. ఎస్‌ఐ సెలక్షన్‌కు హాజరు కావడానికి సాయం చేస్తానని, మెటీరియల్ అందిస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు