స్థానిక సంస్థలకు జవాబుదారీగా పనిచేస్తా

26 Oct, 2016 23:25 IST|Sakshi

కడప కార్పొరేషన్‌: తనను శాసనమండలి సభ్యుడిగా గెలిపిస్తే స్థానిక సంస్థలకు జవాబుదారీగా పనిచేస్తానని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి తెలిపారు. బుధవారం నగరశివార్లలోని ఓ కల్యాణ మండపంలో వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లు, డివిజన్‌ ఇన్‌చార్జులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వైఎస్‌ఆర్‌సీపీకి చాలా ప్రతిష్టాత్మకమైనవని చెప్పారు. ఎన్నికల్లో మనం గెలిస్తే ఒక విధంగానూ, ఓడితే మరో విధంగానూ టీడీపీ ప్రచారం చేసే అవకాశముందన్నారు. జన్మభూమి కమిటీలు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని, ఇది మన దౌర్భాగ్యమన్నారు. స్థానిక సంస్థలపై పెత్తనం చెలాయిస్తున్న జన్మభూమి కమిటీల రద్దు కోసం తాను ముందుండి ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. దేవుళ్ల లాంటి ఓటర్లను మోసం చేస్తున్న ముఖ్యమంత్రికి ఈ ఎన్నికల ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఒక ట్యాంకు తెచ్చి రెయిన్‌ గన్‌ ద్వారా నీటిని చిలకరించి సీమలో కరువును పారద్రోలానని సీఎం చెప్పడం అత్యంత దారుణమన్నారు. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కుళ్లు, కుతంత్రాలు తెలియవని తన తండ్రి ప్రవేశపెట్టిన పథకాలు, ప్రాజెక్టులు పూర్తి చేయాలనే సంకల్పంతోనే ఆయన రాజకీయాల్లో ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో దివంగత వైఎస్‌ఆర్‌ను తలుచుకొని ఒకింత ఉద్వేగానికి లోనై కంటతడిపెట్టారు. అంతకుముందు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు మాట్లాడారు. సౌమ్యుడు, ఆజాతశత్రువు అయిన వైఎస్‌ వివేకానందరెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేయడం మన అదృష్టమని వారు తెలిపారు.  ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి టీకే అఫ్జల్‌ఖాన్, రాష్ట్ర కార్యదర్శి బీఎస్‌ గౌసులాజం,  నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 

>
మరిన్ని వార్తలు