ఈ బతకు నాకొద్దు !

28 Nov, 2016 22:00 IST|Sakshi
ఆరోగ్య పరిస్థితిని వివరిస్తున్న బాలిరెడ్డి
- ఆస్తిని రాయించికుని తండ్రిని గెంటేసిన కొడుకులు
- ఆసుపత్రిలో అనాథగా చికిత్స
- సమాచారం అందినా పలుకరించని కుటుంబీకులు
- ఆస్తిని ఇప్పించి వైద్యం చేయించాలని వేడుకోలు
 
తాతాల ఆస్తి లేదు.. రెక్కల కష్టంతోనే మూడెకరాలు సంపాదించాడు. ఇద్దరు కొడుకులు, నలుగురు కుమార్తెల పెళ్లిల్లు చేశాడు. తోడుగా ఉన్న భార్య కాలం చేసింది. శేష జీవితాన్ని కొడుకుల పంచన ఉండి గడుపొచ్చని కలగన్నాడు. తానొకటి తలిస్తే.. కొడుకులు మరొకటి తలిచారు. ఆస్తినంతా తమ పేరు మీద రాయించుకుని ఇంటి నుంచి గెట్టేశారు. ఊపిరి ఉన్నంత వరకు ఏదో ఒక చోట బతుకుతామని అనాథగా బయలుదేరగా అనారోగ్యం ఆసుపత్రికి చేర్చింది. ఆపరేషన్‌కు డబ్బు అవసరమై కొడుకులకు కబురు అందిస్తే నాన్న.. నీ ఆస్తే మాకు మిన్న.. నువ్వొద్దు ఇంకా.. అంటూ కొడుకులు కన్నెత్తి చూడలేదు. అందరూ ఉన్నా నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడి కన్నీటి గాథ ఇది. 
- నంద్యాల
 
ఆళ్లగడ్డ మండలం బత్తలూరు గ్రామానికి చెందిన బాలిరెడ్డి చిన్నప్పటి నుంచి వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగించాడు. భార్య చౌడమ్మ తోడుగా కష్టపడి పని చేసేవారు. పెద్దల ఆస్తి లేకపోయినా ఇద్దరు వ్యవసాయం చేస్తూ బర్రెలు మేపుకుంటూ ముగ్గురు కుమార్తెలకు, ఇద్దరు కుమారులకు వివాహం చేశారు. కుమారులు లక్ష్మీరెడ్డి, సుబ్బారెడ్డిలకు ఉపాధిని కూడా కల్పించారు.  రెండేళ్ల క్రితం చౌడమ్మ  మృతి చెందింది. అప్పటి నుంచి బాలిరెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. వయోభారం వల్ల ఆరోగ్యం క్షీణించింది. తండ్రిని కాపాడుకోవాల్సిన ఇద్దరు కుమారులు ముందుగా మూడు ఎకరాల పొలాన్ని రాయించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఆయన బాగోగులు చూసుకోలేదు. బాలిరెడ్డికి భగవద్గీత, భాగవతాన్ని పారాయణం చేయగలడు. దీంతో ఆయనకు ఆశ్రమాల్లో గుర్తింపు ఉంది. కొడుకులు ఇద్దరు ఆదరించకపోవడంతో ఆయన నయనాలప్ప క్షేత్రానికి వెళ్లాడు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. అతనికి ఆపరేషన్‌ చేయాలంటే కుటుంబ సభ్యుల అంగీకారం అవసరం. పైగా సపర్యలు చేయడానికి కుటుంబ సభ్యుల సహకారం ఉండాలి. కాని అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథగా ఉండిపోయారు. కన్నకొడుకులు ఆస్తిని బలవంతంగా లాక్కున్నారని, కాని పోషించడానికి మాత్రం ముందుకు రాకుండా భారాన్ని ఒకరిపై ఒకరు వేసుకుంటున్నారని బాలిరెడ్డి రోదిస్తూ చెప్పాడు. వృద్ధాప్యంలో ఆదరించకపోయినా  ఆపరేషన్‌ చేయించడానికి కూడా ముందుకు రాకపోవడంతో బాధపడుతున్నాడు. తన ఆస్తిని ఇప్పించి, వైద్యం చేయించాలని ఆయన ప్రాధేయపడుతున్నాడు. పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది ఆయన కుమారులకు ఫోన్లలో సమాచారం ఇవ్వగా తాము వచ్చే ప్రసక్తే లేదని వారు చెప్పారు. దీంతో బాలిరెడ్డి పరిస్థితి దయనీయంగా మారింది.  
 
>
మరిన్ని వార్తలు