ఏపీని దత్తత తీసుకుంటున్నా..

24 Jan, 2016 22:44 IST|Sakshi
ఏపీని దత్తత తీసుకుంటున్నా..

అమలాపురం/కాకినాడ రూరల్(తూర్పుగోదావరి జిల్లా): 'ఆంధ్రప్రదేశ్‌ను ఈరోజు నుంచి దత్తత తీసుకుంటున్నా. రాష్ట్రాన్ని 100 శాతం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం సాగుచేసే రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను' అని జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ వేల మంది రైతుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంపై ఆదివారం ప్రారంభమైన శిక్షణా తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

దేశంలో మొదటిసారిగా ఆరు వేల మందికి 8 రోజుల పాటు ఇక్కడ ఆయన ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తున్నారు. 13 జిల్లాల నుంచి సుమారు ఐదు వేల మంది రైతులు, వెయ్యి మంది వ్యవసాయ శాఖాధికారులు, సిబ్బంది శిక్షణకు హాజరయ్యారు. శిక్షణ ప్రారంభోత్సవంలో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ప్రకృతి వ్యవసాయంలోకి మార్చడానికి రాష్ట్రాన్ని దత్తత తీసుకోవాలని పాలేకర్‌కు విజ్ఞప్తి చేశారు. పాలేకర్ మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభాన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి రాష్ట్రాన్ని సంతోషంగా దత్తత తీసుకుంటానని ప్రకటించారు.

రాష్ట్రంలో రైతులందరినీ ప్రకృతి సేద్యంలోకి మళ్లించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానన్నారు. రైతుల ఆత్మహత్యలను నిలువరించడానికి, పెట్టుబడులు తగ్గి రైతుల నికరాదాయం పెంచడానికి జీరోబడ్జెట్ సేద్యం ఒక్కటే మార్గమన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం ముదావహమన్నారు. 'ఇప్పుడున్న సాగు భూమి విస్తీర్ణం పెరిగే అవకాశం లేదు. కొత్తగా భూమిని సృష్టించలేం. విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు, మందుల వాడకం వల్ల భూసారం దెబ్బతిని దిగుబడులు తగ్గుతున్నాయి. రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రకృతి వ్యవసాయం చేస్తేనే 2050 నాటికి వ్యవసాయోత్పత్తుల దిగుబడిని రెట్టింపు చేయగలం' అని పాలేకర్ వివరించారు.

మరిన్ని వార్తలు