నేను సచ్చిపోతున్న..

28 Mar, 2016 02:57 IST|Sakshi
నేను సచ్చిపోతున్న..

మంత్రి కేటీఆర్‌కు నేతన్న వాట్సప్ మెసేజ్
 
సిరిసిల్ల: తాను చనిపోతున్నానని, వస్త్ర పరిశ్రమలో చిన్నవారిని పెద్దసేట్లు బతకనివ్వడం లేదని, మీరైనా పరిస్థితి మార్చాలంటూ కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన ఓ నేతన్న మంత్రి కేటీఆర్‌కు బహిరంగ విన్నపం చేశాడు. వస్త్రపరిశ్రమలో చిన్న వ్యాపారులను పెద్ద వ్యాపారులు మింగేస్తున్న వైనాన్ని సదరు నేతన్న కన్నీటి పర్యంతమవుతూ వివరించారు. వాట్సప్‌లో అతడు పోస్ట్ చేసిన వాయిస్ మెసేజ్  చర్చనీయాంశమైంది.

‘నేను చనిపోతున్న.. డబ్బుల కోసం సిరిసిల్లలోని వస్త్రవ్యాపారుల ఎదుటే అజయ్‌భాయ్ నన్ను గట్టిగా కొట్టిండు. నేను లాస్ అయిన.  ఇస్తానని చెప్పినా వినలేదు. ఈ చిత్రహింసకన్నా చనిపోవాలని ఉంది. సిరిసిల్లల సేట్లు, మార్వాడీ సేట్లు బాధిస్తుండ్రు. రెండుసార్లు చనిపోవాలని వెళ్లిన. నా భార్యాపిల్లలు గుర్తొచ్చి ఆగిన. వ్యాపారం నడవకుంట యారన్(నూలు) ఇవ్వకండి అని చెప్పిండ్రు. దానివల్ల నా సాంచాలు బంద్ పడ్డయి. నెలకు లక్షా 20 వేలు నష్టపోయిన. దయచేసి.. నా చావుతోనైనా సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకుంటున్నా.

మంత్రి కేటీఆర్ గారూ..
మంత్రి కేటీఆర్ గారు దయచేసి నా ఆత్మహత్యతోనైనా మీరు చర్యలు తీసుకుంటారని అనుకుంటున్న. నా భార్యపిల్లలకు న్యాయం చేయండి..’ అంటూ సదరు నేతన్న ఆవేదన పూరితంగా పెద్ద సేట్ల పేర్లు, వ్యాపారుల పేర్లు ఉటంకిస్తూ.. వాయిస్ రికార్డు చేసి వాట్సప్‌లో పంపారు. బాధిత నేతన్న వాయిస్ వాట్సప్‌లో రావడంతో సదరు నేతన్నను పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించాలని సేట్లు పోలీసులను కోరినట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు