ఐఏఎస్‌.. పీహెచ్‌సీలో డెలివరీ..

2 Aug, 2017 22:52 IST|Sakshi
ఐఏఎస్‌.. పీహెచ్‌సీలో డెలివరీ..
ఏరియా ఆస్పత్రిలో సబ్‌కలెక్టర్‌ ప్రసవం
ప్రభుత్వ వైద్యంపై భరోసా కల్పించేందుకేనన్న పీఓ దినేష్‌కుమార్‌
రంపచోడరవరం :  రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ విజయకృష్ణన్‌ రంపచోడవరం ప్రభుత్వాసుపత్రిలో బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆమె భర్త ఏఎస్‌ దినేష్‌కుమార్‌ రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్నారు. దంపతులిద్దరూ ఐఏఎస్‌ అధికారులైనప్పటికీ కార్పొరేట్‌ ఆస్పత్రులను పక్కన పెట్టి ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనివ్వడం ద్వారా పలువురికి ఆదర్శంగా నిచిచారు. ప్రభుత్వాస్పత్రిల్లో సైతం మెరుగైన వైద్యం అందుతుందనే భరోసా సామాన్యుల్లో కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఓ దినేష్‌కుమార్‌ తెలిపారు. ఏరియా ఆస్పత్రిలో వసతులపై నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఏరియా ఆస్పత్రిలో ప్రసూతి వైద్య నిపుణులు, మత్తు వైద్యుడు, చిన్న పిల్లల వైద్యుడు అందుబాటులో ఉండడంతో మెరుగైన వైద్య సేవలు అందుతున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఏజెన్సీ ఆస్పత్రిల్లో వసతులు, వైద్య సేవలు మెరుగుపరిచినట్లు తెలిపారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రి కార్పొరేట్‌ ఆస్పత్రికి స్థాయికి తగ్గకుండా వసతులు ఉన్నట్లు వెల్లడించారు. ఏరియా ఆస్పత్రి ఇన్‌చార్జి కార్తీక్‌ మాట్లాడుతూ సబ్‌ కలెక్టర్ రెండు నెలలుగా రెగ్యులర్‌ చెకప్‌ చేయించుకుంటున్నారని తెలిపారు. ఏరియా ఆస్పత్రి వైద్య బృందంలోని గైనకాలజిస్ట్‌ వీరబ్బాయి తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. రంపచోడవరం ఏఎస్పీ అద్నాన్‌ నయీం ఆస్మీ, స్థానిక సర్పంచ్‌ వై.నిరంజనీదేవి పీఓను కలసి అభినందించారు. డీసీహెచ్‌ రమేష్‌కిషోర్, ఏజెన్సీ వైద్య ఆరోగ్యశాఖ అధికారి పవన్‌కుమార్‌ పర్యవేక్షించారు.
మరిన్ని వార్తలు