కోనసీమలో ఐబీఎం ప్రతినిధులు

25 Feb, 2017 23:28 IST|Sakshi
కోనసీమలో ఐబీఎం ప్రతినిధులు
-పలు ప్రాంతాల్లో పర్యటన 
-కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల పరిశీలన
అంబాజీపేట (పి.గన్నవరం) :కోనసీమలో కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల అ«ధ్యయనానికి ఇంటర్నేషన్‌ బిజినెస్‌ మెషీన్‌(ఐబీఎం)కు చెందిన ముగ్గురు ప్రతినిధులు శనివారం కోనసీమలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కమ్యూనిటీ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ పథకంలో భాగంగా అమెరికాకు చెందిన మెర్రీలాన్, డెన్మార్క్‌కు చెందిన క్రిస్టిన్, ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్రీల బృందానికి ఇక్రిశాట్‌ మేనేజర్‌ జి.పార్థసారథి నాయకత్వం వహించారు. అంబాజీపేటలో విలేకరులతో సమావేశమయ్యారు. అయినవిల్లిలో కొబ్బరికాయల దింపు, వలుపు, కాయలను ముక్క పెట్టడం, ప్యాక్‌ హౌస్‌లలో నిల్వ చేయడాన్ని పరిశీలించారు. అయినవిల్లిలంకలో కొబ్బరి పీచు పరిశ్రమను సందర్శించి తాడు తయారీ, మార్కెటింగ్, కొబ్బరి తోటలలో అంతర పంటల సాగును పరిశీలించారు. అయినవిల్లికి చెందిన విళ్ళ దొరబాబు నిర్వహిస్తున్న ఎకో టూరిజంను సందర్శించి ఉద్యాన శాఖ విద్యార్థులకు ఏవిధంగా శిక్షణ ఇస్తున్నారో పరిశీలించారు. అమలాపురం రూరల్‌ మండలం చిందాడ గరువులో కొబ్బరి చెట్ల నుంచి కల్పరస తీసే విధానం, వర్మీ కంపోస్టు నిర్వహణ, ఒంగోలు జాతి ఆవుల సంరక్షణల గురించి నిర్వాహకుడు అడ్డాల గోపాలకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఎంట్రికోనలో కొబ్బరి కలెక్షన్‌ గ్రేడింగ్‌ సెంటర్‌ను సందర్శించారు. బండారులంకలో సమయమంతుల పండుకు పొలంలో కోప్రా డ్రైయర్, అరటి పళ్ళను సహజంగా ముగ్గపెట్టే పద్ధతిని పరిశీలించారు. అంబాజీపేటలోని కృషీవల కోకోనట్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ అధ్యక్షుడు గణపతి వీరరాఘవులుతో సమావేశమై కొబ్బరి కాయలు వలిచే యంత్రాన్ని, గణపతి బాబులుకు చెందిన మిల్లులో కొబ్బరి నూనె తీసే విధానాన్ని పరిశీలించారు. బీకేఎస్‌ జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు నిర్మిస్తున్న ప్యాక్‌ హౌస్‌ను సందర్శించి ఆయన సాగు చేస్తున్న 24 రకాల మొక్కలను పరిశీలించారు. గత పది రోజులుగా ఈ బృందం ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌లతో కలిసి వివిధ అంశాలపై అధ్యయనం చేస్తున్నారని, ప్రభుత్వానికి నేరుగా నివేదిక సమర్పిస్తారని ఇక్రిశాట్‌ మేనేజర్‌ పార్థసారథి తెలిపారు.  వీరి వెంట అమలాపురం ఏడీహెచ్‌ సీహెచ్‌ శ్రీనివాస్, బీకేఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మీలు, ఉపాధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావు, దంగేటి గిరిధర్, ఉద్యాన శాఖ ఏఓ వెంకటేశ్వరరావు, ఎంపీఈఓ సీహెచ్‌ రాజేష్‌ ఉన్నారు.
>
మరిన్ని వార్తలు