ఉద్యమంలా కందకాలు

6 Jul, 2016 03:02 IST|Sakshi
ఉద్యమంలా కందకాలు

కదిలిన కర్షకులులక్ష్యం దిశగా అడుగులు
550 ఎకరాల్లో నిర్మాణాలు
మరో 150 ఎకరాలే టార్గెట్
మరో రికార్డుకు చేరువలో ఇబ్రహీంపూర్

ఇబ్రహీంపూర్.. చైతన్యానికి మారు పేరు.. పని ఏదైనా నూటికి నూరు శాతం చేయడం వీరికి అలవాటు. చెప్పడమే ఆలస్యం చేసి చూపిస్తారు. మంత్రి హరీశ్‌రావు దత్తత తీసుకున్న ఈ గ్రామం వినూత్న ప్రయోగాలకు వేదికగా నిలుస్తూ రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామంగా పేరొందింది. జాతీయ స్థాయి పురస్కారాన్నీ సొంతం చేసుకుంది. తాజాగా కందకాల నిర్మాణాన్ని ఇక్కడి రైతులు ఉద్యమంలా చేపడుతున్నారు. లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ మరో రికార్డుకు చేరువలో ఉన్నారు

సిద్దిపేట రూరల్
ఇబ్రహీంపూర్.. వినూత్న ప్రయోగాలకు ఈ గ్రామమే వేదిక. ఏ కొత్త ప్రాజెక్టు అయినా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టారు. వృథా నీటిని భూమిలోకి చేర్చుతున్నారు. ఈ పద్ధతిలోనే పొలాల్లో పడ్డ వర్షపు నీరంతా వృథాగా పోకుండా ఉండేందుకు కందకాల తవ్వకాలకు శ్రీకారం చుట్టారు. నీటిని సంరక్షించేందుకు సర్పంచ్ కుమారుడు ఎల్లారెడ్డికి వచ్చిన ఆలోచనను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఉపాధి హామీ పథకం ద్వారా పొలాల్లో కందకాలు నిర్మిస్తే ఫలితం వస్తుందని భావించారు. ఇదే ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన పైలట్ ప్రాజెక్ట్ కింద ఉపాధి హామీలో కందకాలు తవ్వించడానికి గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రత్యేకంగా నిధులను  మంజూరు చేయించారు.

నెలన్నర క్రితం మొదలై...
ఇబ్రహీంపూర్‌లో కందకాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ విజయవంతమైతే మండలం మొత్తానికి విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఇక్కడ నెలన్నర రోజుల క్రితం కందకాల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు వంద మంది రైతుల పొలాల్లో 550 ఎకరాల్లో 7వేల మీటర్ల మేర నిర్మించారు. దాదాపు ఆయా పొలాల్లో పడ్డ వర్షం నీరంతా కందకాల్లోకి చేరేలా చర్యలు చేపట్టారు. మరో 150 ఎకరాల్లో నిర్మిస్తే వంద శాతం పూర్తిచేసుకున్న గ్రామంగా ఇబ్రహీంపూర్ రికార్డు కెక్కనుంది.

 కందకం నిర్మాణం ఇలా....
పొలంలో గట్టు చివర దిగువ భాగాన మీటరు వెడల్పు లోతు, ఐదు మీటర్ల పొడవుతో కందకం నిర్మిస్తున్నారు. మీటరు ఎడంతో మరోటి నిర్మిస్తున్నారు. దీంతో ఆ పొలంలో పడ్డ వర్షపు నీరంతా దిగువకు ప్రవహించి కందకంలోకి చేరుతుంది. ఫలితంగా తేమ ఎక్కువగా ఉండి పంటకు మేలు చేకూరుతుంది. వర్షాధార పంటలు సాగు చేసే రైతులకు ఎంతోమేలు చేస్తుంది. వర్షాలు ఆలస్యమైన  సందర్భంలో గుంతలోని నీరు ఇంకడంతో తేమశాతం పెరిగి పొలంలోని మొక్కలకు ఉపయోగపడుతుంది. మరో 150 ఎకరాల్లో కందకాల నిర్మాణం పూర్తయితే గ్రామంలో పడ్డ ప్రతి నీటి చుక్క అక్కడే ఇంకుతుంది. ఓ వైపు ఇంకుడు గుంతలతో వృథా నీరు భూమిలోకి వెళ్తుండగా, వర్షాలు పడ్డప్పుడు ఒర్రె ద్వారా వాగులో కలిసి జిల్లా దాటుతున్న నీటిని అడ్డుకట్టలు వేసేందుకు మరో వైపు కందకాలు నిర్మిస్తున్నారు.

మరిన్ని వార్తలు