ఐసీడీఎస్‌లో విలీన సెగ

1 Oct, 2016 22:24 IST|Sakshi
ఐసీడీఎస్‌లో విలీన సెగ
  • నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన
  • వికలాంగుల శాఖను కలపొద్దని ఆందోళన
  • విలీనం జరిగితే శాఖ ఉనికిని కోల్పోతుందని ఉద్యోగుల ఆవేదన
  • వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు
  • ఇందూరు:
    ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియపై మొన్నటివరకు జిల్లా వ్యాప్తంగా అభ్యంతరాలు, ధర్నాలు, రాస్తారోకోలు వెల్లువెత్తాయి. తాజాగా ప్రభుత్వం తీసుకొన్న మరో నిర్ణయంపై ప్రభుత్వ శాఖల నుంచే వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. శాఖల విలీనంపై అభ్యంతరాలు, నిరసనలు ప్రారంభమయ్యాయి. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్‌) నుంచే వ్యతిరేకత ప్రారంభమైంది. ప్రభుత్వం ఐసీడీఎస్‌ శాఖలో వికలాంగుల సంక్షేమ శాఖను విలీనం చేయడంపై ఐసీడీఎస్‌ శాఖలో తీవ్ర వ్యతిరేకత, ఆందోళన మొదలైంది. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఐసీడీఎస్‌ ఉద్యోగులు ఈ నెల 7 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నారు. తొలి రోజైన శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
    భావ సారుప్యత కలిగిన ఐసీడీఎస్‌ శాఖ పిల్లలు, మహిళల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని, ఈ శాఖ మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిందని ఆ శాఖ ఉద్యోగులు బలంగా తమ వాదనను వినిపిస్తున్నారు. ఇలాంటి శాఖలో భావ సారూప్యత లేని వికలాంగుల సంక్షేమ శాఖను విలీనం చేయడం భావ్యం కాదని పేర్కొంటున్నారు. ఆ శాఖను విలీనం చేయడం వల్ల ఐసీడీఎస్‌ శాఖ తమ ఉనికిని కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు ఇతర శాఖల అధికారుల వద్ద పని చేయడం వల్ల ఆత్మన్యూనతకు గురయ్యే అవకాశముందని, పై స్థాయి నుంచి అంగన్‌వాడీ కార్యకర్తల వరకూ అందిరలోనూ ఇదే ఆందోళన నెలకొందని పేర్కొంటున్నారు. అయితే వికలాంగుల శాఖ విలీనంపై ఐసీడీఎస్‌ డైరెక్టర్‌కు ఉద్యోగ సంఘ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అప్పటికీ స్పందించపోతే నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని తేల్చి చెప్పారు. అందులో భాగంగా నిజామాబాద్‌ ఐసీడీఎస్‌ జిల్లా కార్యాలయంలో ఉద్యోగులు శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఐసీడీఎస్‌ సూపరింటెండెంట్‌ రమణాచాని, శ్రీనివాస్, విజయ, మహిపల్, ఇతర ఉద్యోగులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
    కార్యాచరణ ఇలా..
    – 3వ తేదీన ఐసీడీఎస్‌ కార్యాలయాల ఉద్యోగుల సామూహిక సెలవు
    – 4న ఐసీడీఎస్‌ డైరెక్టరేట్‌ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
    – 5 నుంచి 7 వరకు జిల్లాల వారీగా డైరెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమాలు 
మరిన్ని వార్తలు