కొత్త ఇసుక రీచ్‌లు గుర్తించండి

2 Apr, 2017 00:00 IST|Sakshi
– జిల్లా కలెక్టర్‌
కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో ఇసుక తవ్వకాలకు కొత్త రీచ్‌లను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా ఇసుక కమిటీ సమావేశాన్ని తన చాంబరులో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... గనుల శాఖ, భూగర్భ జల శాఖ, ఇరిగేషన్‌ అధికారులు కమిటీగా ఏర్పడి తుంగభద్ర, హంద్రీ ఇతర ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు కొత్త రీచ్‌లను గుర్తించాలని తెలిపారు. కొత్త రీచ్‌ల గుర్తింపు ప్రతిపాదనలను 15 రోజుల్లో ఇవ్వాలని కమిటీ సభ్యులను ఆదేశించారు.
 
హంద్రీ నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలను 100 శాతం అదుపు చేయాలని తెలిపారు. అక్రమంగా ఇసుకను తరలించే వారు ఏ స్థాయి వారైన కఠిన చర్యలు తీసుకోవాలని వివరించారు. ఏడు మండలాల్లోని హంద్రీ తీర గ్రామలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు హంద్రీలో నిరంతరం గస్తీ తిరుగుతూ... ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టాలని తెలిపారు. హంద్రీ వెంట అడ్డుగోలుగా వేసిన బోర్లను గుర్తించాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జేసీ హరికిరణ్, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, గనులశాఖ ఏడీ వెంకటరెడ్డి, కర్నూలు ఆర్‌డీఓ హుసేన్‌ సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు