‘విగ్రహ లొల్లి’లో మూడో వ్యక్తి..

16 Aug, 2017 01:20 IST|Sakshi
‘విగ్రహ లొల్లి’లో మూడో వ్యక్తి..

దేవరకొండకు వెళ్లిన వారిలో పరిచారకుడు
ఆయనపైనా చర్యలకు బాసర గ్రామస్తుల డిమాండ్‌
ఉన్నతాధికారులకు రిపోర్టు చేశామన్న ఈవో
బాసర ఆలయ పరిధి వివాదాల నేపథ్యం..


నిర్మల్‌రూరల్‌: పవిత్ర బాసర సరస్వతీ క్షేత్రంలో అమ్మవారి ‘విగ్రహ లొల్లి’ మరో మలుపు తిరిగింది. జూలై 28న నల్గొండ జిల్లా దేవరకొండకు అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి.. అక్కడ ప్రైవేటు స్కూళ్లలో పూజలు చేయించింది ఇద్దరు కాదని.. ముగ్గురని తేలింది. ఇప్పటికే ఈ ఘటనలో ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్‌ పూజారి, సప్తశతి పారాయణధారుడు ప్రణవ్‌శర్మలకు దేవాదాయశాఖ సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా ఈ ఘటనలో మూడో వ్యక్తి కూడా ఉన్నట్లు బయటపడింది. దేవరకొండకు సంజీవ్‌ పూజారి, ప్రణవ్‌శర్మలతో పాటు ఆలయ పరిచారకుడు విశ్వజిత్‌ కూడా వెళ్లినట్లు   ఫొటోలు బయటకు వచ్చాయి.

కాగా, అధికారులకు విశ్వజిత్‌ కూడా వెళ్లినట్లు ముందే తెలిసినా బయటపెట్టలేదని, అసలు దేవరకొండకు వెళ్లిన విషయాన్ని పరిచారకుడే అధికారులకు చెప్పాడని సమాచారం. ఈ మేరకు ముందుగా విశ్వజిత్‌ ఉన్న ఫొటోలను, ఆయన పేరును బయట పెట్టకుండా జాగ్రత్త పడ్డట్లు తెలిసింది. తీరా ఇప్పుడు మూడో వ్యక్తిగా విశ్వజిత్‌ కూడా దేవరకొండ పూజలో పాల్గొన్నట్లు తేలడంతో అధికారులు నీళ్లు నములుతున్నారు.

చర్యలకు డిమాండ్‌
అసలు.. ఆలయంలో ఏం జరుగుతోందని బాసర గ్రామస్తులు మండిపడుతున్నారు. దేవరకొండకు విగ్రహం తీసుకెళ్లడంతో పాటు పూజలు చేయించిన పరిచారకుడు విశ్వజిత్‌ పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ఈవో సుధాకర్‌రెడ్డిని సంప్రదించగా, దేవరకొండ పూజలో పరిచారకుడు విశ్వజిత్‌ కూడా పాల్గొన్నట్లు తేలిందని, ఆయనపైనా చర్యలకు ఉన్నతాధికారులకు రిపోర్టు పంపించామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు