వ్యర్థ పదార్థాలను రోడ్లపై వేస్తే నోటీసులు జారీ

13 Oct, 2016 23:28 IST|Sakshi

కడప వైఎస్సార్‌ సర్కిల్‌ : స్టోన్‌ క్రషింగ్‌ యూనిట్లు, ఎర్రగుంట్ల శ్లాబ్‌ పాలిష్‌ యూనిట్లు వ్యర్థాలను రహదారికి ఇరువైపులా వేస్తున్న వారికి చివరి నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిశ్రమల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటీసులు జారీ చేసిన తర్వాత వ్యర్థాలను తొలగించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రొద్దుటూరు అపెరల్‌ పార్కును సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కుగా ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో వంద ఎకారల్లో పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.  సమావేశంలో వివిధ శాఖల నుంచి అనుమతి పొందిన 54 పరిశ్రమలకు సంబంధించి ఆమోదం తెలిపారు. ఒక యూనిట్‌ను తిరస్కరించారు. అలాగే షెడ్యూల్‌ కులాల, తెగల వారికి పెట్టుబడి రాయితీ కింద 9 యూనిట్లకు రూ. 86.46 లక్షలు, పావలా వడ్డీ రాయితీ కింద 14 యూనిట్లకు రూ. 75.10 లక్షలు, విద్యుత్‌ రాయితీ కింద 8 యూనిట్లకు రూ. 13.25 లక్షలు, స్టాంప్‌ డ్యూటీ కింద మూడు యూనిట్లకు రూ. 13.46 లక్షలు, సేల్‌ట్యాక్స్‌ రాయితీ కింద ఏడు యూనిట్లకు రూ. 42.56 లక్షలు మంజూరు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం జయలక్ష్మి, ఎల్‌ఎం రఘునాథరెడ్డి, సోషల్‌ వెల్ఫేర్‌ డెప్యూటీ డైరెక్టర్‌ సరస్వతి, ఏపీఈఈసీ జోనల్‌ మేనేజర్‌ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు