మాట వినకుంటే కనెక్షన్‌ కట్టే!

14 Oct, 2016 17:16 IST|Sakshi
మాట వినకుంటే కనెక్షన్‌ కట్టే!
* ఓ షోరూం నిర్వాహకులపై వేధింపులు
తమ షోరూం నుంచి వాహనాలు కొనుగోలు చేయాలంటూ హుకుం
మాట వినకపోవడంతో విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ చేయించిన వైనం
నోటీసు ఇచ్చినరోజే హడావిడిగా విద్యుత్‌ సరఫరా నిలిపివేత
 
 ఆయన కన్ను పడితే కబ్జాలే.. మాట వినకుంటే మటాషే.. అడిగినంత ఇవ్వాల్సిందే.. చెప్పింది చెయ్యాల్సిందే.. ఏ వ్యాపారం అయినా తన వాటా తేల్చాల్సిందే.. తాను చేసే వ్యాపారం ఎవరు చేసినా అందులో తనకు లబ్ధి కలగాల్సిందే.. లేదంటే బెదిరింపులు.. అప్పటికీ మాట వినకుంటే వేధింపులు.. అధికారులను రంగంలోకి దించి ఆర్థికంగా నష్టం కలిగించే చర్యలకు దిగుతారు..  
- సాక్షి, గుంటూరు 
 
సత్తెనపల్లి పట్టణంలో 15 ఏళ్లుగా ఓ ద్విచక్రవాహనం షోరూమ్‌ను నిర్వహిస్తున్న వ్యాపారిని ముఖ్యనేత తనయుడు గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. గుంటూరులో ఉన్న తమ షోరూమ్‌ నుంచి ద్విచక్రవాహనాలను కొనుగోలు చేసి అమ్మకాలు జరపాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. గతంలో ఏఆర్డీగా ఉండే షోరూమ్‌ ప్రస్తుతం ఆథరైజ్డ్‌ సర్వీస్‌ సెంటర్‌గా గుర్తింపు పొందింది. కంపెనీ వారి ఆదేశాలతో మొదటì  నుంచి గుంటూరులోని ఓ షోరూమ్‌ ద్వారా ద్విచక్రవాహనాలను దిగుమతి చేసుకుని వీరు అమ్మకాలు జరుపుతున్నారు. అయితే సత్తెనపల్లిలో వాహనాల కొనుగోళ్లన్నీ తమ షోరూమ్‌ నుంచి జరగాలంటూ ముఖ్యనేత తనయుడు పట్టుబట్టాడు. దీనిపై వారు.. కంపెనీ సూచించిన మేరకే గుంటూరులో కొనుగోలు చేస్తున్నామని తెలియజేశారు. దీంతో తమ మాట వినలేదని ఆగ్రహం చెందిన సదరు ముఖ్యనేత తనయుడు విద్యుత్‌ అధికారులను ప్రయోగించి సదరు షోరూమ్‌పై దాడులు చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారం సదరు షోరూమ్‌కు వెళ్లిన విద్యుత్‌ అధికారులు 14 కేవీ లోడు వాడాల్సి ఉండగా, 17 కేవీ లోడు వాడుతున్నారని, మిగతా డబ్బులు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు. సాధారణంగా నోటీసులు ఇచ్చిన తరువాత కొన్ని రోజులపాటు వీరు డబ్బు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. అయితే మొదటిసారి నోటీసులు ఇచ్చిlవెళ్లిన అధికారులు.. అదేరోజు రెండోసారి మళ్లీ షోరూమ్‌కు వచ్చి విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ చేసి సరఫరా నిలిపివేశారు. దీనిపై షోరూమ్‌ నిర్వాహకులు విద్యుత్‌ అధికారులను నిలదీయగా, తమపై ఉన్న ఒత్తిళ్లు అర్థం చేసుకోవాలంటూ చెప్పి వెళ్లిపోయారు. అయితే సదరు షోరూమ్‌ నిర్వాహకులు వెంటనే 3 కేవీకి డబ్బులు చెల్లించి తిరిగి విద్యుత్‌ కనెక్షన్‌ పునరుద్ధరించుకున్నారు. అయినప్పటికీ ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేయాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
అధికారుల వివరణ ఇదీ...
ఈ విషయంపై విద్యుత్‌ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా అధిక లోడు వాడుతుండటంతో విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ చేశామని, డబ్బు చెల్లించగానే పునరుద్ధరించామని చెప్పారు. నోటీసు ఇచ్చిన తరువాత సమయం ఉంటుంది కదా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఫోన్‌ పెట్టేశారు.
 
పెచ్చుమీరుతున్న దౌర్జన్యాలు...
నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో వ్యాపారులు, కాంట్రాక్టర్లపై ముఖ్యనేత తనయుని దాషీ్టకాలు, దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో వీరు మరింతగా రెచ్చిపోతున్నారు. వీరు చేసే అక్రమ దందాలకు అధికారులను ప్రయోగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు సైతం వీరిపై చర్యలు చేపట్టకుండా చూసీచూడనట్లు వదిలేయడం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
మరిన్ని వార్తలు