ముంపుకు గురైతే నష్ట పరిహారం ఇస్తాం

11 Jul, 2017 22:56 IST|Sakshi

పుట్టపర్తి అర్బన్‌ : హంద్రీనీవా నీళ్లతో గాని, వర్షపు నీళ్లతో గాని బుక్కపట్నం చెరువు నిండినప్పుడు భూములు ముంపు గురైతే తప్పకుండా నష్ట పరిహారం ఇప్పిస్తామని జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. మంగళవారం పుట్టపర్తిలో హంద్రీనీవా కాలువ పనులను ఆయన పరిశీలించారు.

పుట్టపర్తి సమీపంలో 9వ ప్యాకేజీలో పెండింగ్‌లో ఉన్న భూమిని చూశారు. అక్కడ సాగులో ఉన్న రైతులతో మాట్లాడి వెంటనే కాలువ నిర్మాణ పనులు పూర్తయ్యే విధంగా చూడాలని ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి సూచించారు. ఇక బుక్కపట్నం చెరువుకు నీళ్లు వస్తే పెద్ద కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన రైతుల భూములు మంపుకు గురయ్యే ప్రాంతాన్ని పరిశీలించారు.

అక్కడకు వచ్చిన  కమ్మవారిపల్లి రైతులతో మాట్లాడారు. గ్రామానికి చెందిన పలువురు రైతులకు చెందిన సుమారు 90 ఎకరాలు మంపుకు గురవుతుందని కదిరి ఆర్డీఓ వెంకటేషు, తహసీల్దార్‌ సత్యనారాయణ తెలిపారు.  ప్రస్తుతానికి హంద్రీనీవా నీళ్లు రాక పోవడంతో చెరువులో నీళ్లు సైతం ఎండిపోతాయని కలెక్టర్‌ పేర్కొన్నారు.

దీంతో భూములు ముంపుకు గురికావని, వర్షాలు వచ్చే సూచన కూడా లేకపోవడంతో మీ భూములు క్షేమం కాబట్టి ప్రస్తుతం నష్ట పరిహారం ఇవ్వలేమన్నారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే పల్లె కల్పించుకొని ఎప్పటికైనా ముంపుకు గురవుతాయని, ఇప్పుడే నష్ట పరిహారం అంచనా వేసే కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుందని కలెక్టర్‌కు చెప్పడంతో ప్రభుత్వానికి నివేదిస్తానని కలెక్టర్‌ రైతులకు చెప్పారు. అప్పటి వరకు రైతులంతా పంటలు సాగు చేసుకోవచ్చన్నారు. 

మరిన్ని వార్తలు