ఇల్లు కట్టాలంటే చెట్లు నాటాల్సిందే..

9 Sep, 2016 23:13 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా నిర్మించే ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల్లో తప్పనిసరిగా చెట్లను పెంచాల్సిందే. లేని పక్షంలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం స్వయంగా రంగంలోకి దిగి మొక్కలు నాటి అందుకైన ఖర్చులను ఆస్తి పన్ను బకాయిల కింద వసూలు చేయనుంది. భవన నిర్మాణ అనుమతుల జారీకి చెట్ల పెంపకాన్ని తప్పనిసరి చేస్తూ ఈ నెల 1న రాష్ట్ర పురపాలక శాఖ  ఉత్తర్వులు జారీ చేయగా, శుక్రవారం జీహెచ్‌ఎంసీ వీటిని విడుదల చేసింది.  ఈ ఉత్తర్వుల మేరకు  రాష్ట్ర వ్యాప్తంగా నగర, పట్టణ ప్రాంతాలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో భవన నిర్మాణ అనుమతుల కోసం చెట్ల పెంపకం తప్పనిసరి చేశారు.

అయితే, జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రమే చెట్లు పెంచని ఇళ్లు, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల్లో ప్రభుత్వ యంత్రాంగం చెట్లను నాటి అందుకైన ఖర్చులను యజమానుల నుంచి ఆస్తి పన్ను బకాయిల కింద వసూలు చేయనుంది.  చెట్లు పెంచకపోతే జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర నగర, పురపాలికలు సంబందిత భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లను జారీ చేయకూడదని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్లాట్‌ విస్తీర్ణం ఆధారంగా నివాస గృహాలు, వాణిజ్య సముదాయాల్లో ఉండాల్సిన కనీస చెట్ల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేసింది.

నివాస గృహాల స్థల విస్తీర్ణం100 చదరపు మీటర్లకు మించిన ప్రతి ఇంట్లో చెట్ల పెంపకాన్ని తప్పనిసరిగా మారింది. 100–200 చదరపు మీటర్ల  విస్తీర్ణంలో గల నివాస గృహాల్లో కనీసం 5 చిన్న, మధ్యతరహా  రకం చెట్లను పెంచాల్సి ఉంటుంది. పీసీబీ మార్గదర్శకాల ప్రకారం పారిశ్రామిక ప్రాంతాల్లో సైతం నిర్ణీత సంఖ్యలో చెట్లను పెంచాలని కోరింది. స్థల విస్తీర్ణం ఆధారంగా ఇళ్లు, వాణిజ్య సముదాయాల్లో ఉండాల్సిన చెట్ల సంఖ్యను ఈ కింది పట్టికల్లో చూడవచ్చు...

 

మరిన్ని వార్తలు