వరంగల్‌లోనే ఐఐఎం

22 May, 2016 19:50 IST|Sakshi

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
హన్మకొండ

 వరంగల్‌లోనే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. హన్మకొండలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐఐఎంను వరంగల్‌లోనే ఏర్పాటు చేయాలని తాము సీఎం కేసీఆర్‌ను కోరామని, సీఎం సానుకూలంగా ఉన్నారని చెప్పారు. వచ్చే ఏడాది ఐఐఎం రానుందన్నారు. జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు రక్షణ శాఖకు చెందిన కెప్టెన్ రాంబాబు స్థల పరిశీలన చేశారన్నారు.

దీనిపై రక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాల్సి ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో సైనిక్ స్కూల్ ప్రారంభం కానుందని తెలిపారు. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం ఇంగ్లిష్ మీడియంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒక్కో గురుకులానికి రూ.20 కోట్లతో భవనాలు నిర్మించి, వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. టీచింగ్, నాన్ టీచింగ్ కలుపుకుని ఒక్కో గురుకులంలో 35 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
 

>
మరిన్ని వార్తలు