కొందరికే అను‘గృహం’

27 Jul, 2016 22:44 IST|Sakshi

– జిల్లాకు 11,216 ఇళ్లు మంజూరు
– స్థలం ఉన్న వారికే అవకాశం
– తాడిపత్రిలో జీ ప్లస్‌ 2 నమూనాతో సముదాయం
– ఏపీటీఐడీసీఎల్‌కు బాధ్యతలు

 
సొంతింటి కల కొందరికి మాత్రమే సాకారం కానుంది. ఇంటి స్థలాలు లేని వారికి కూడా ఇళ్లు కట్టిస్తామని చెప్పిన సర్కారు.. ఇప్పుడు స్థలమున్న వారికి మాత్రమే అవకాశం ఇస్తోంది. తాడిపత్రి మునిసిపాలిటీ మినహా మిగిలిన అన్ని చోట్ల స్థలం ఉన్న వారు మాత్రమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.


కేంద్ర ప్రభుత్వం ‘అందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా పట్టణాలకు ఇళ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని ఒక నగర పాలక సంస్థ, ఆరు మునిసిపాలిటీలకు కలిపి 11,216 ఇళ్లు మంజూరయ్యాయి. నిర్మాణాలకు లబ్ధిదారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే పురపాలక అధికారులు దరఖాస్తులు స్వీకరించి.. గృహ నిర్మాణశాఖకు ప్రతిపాదించారు. జన్మభూమి గ్రామసభల్లో అందిన దరఖాస్తుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు.

ఈ సందర్భంగా ఇంటి స్థలం ఉన్న వారు.. లేని వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. 11,216 ఇళ్లకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సముదాయ విధానంగా తాడిపత్రి మునిసిపాలిటీలో 3,009 ఇళ్లకు అనుమతి లభించింది. ఇందుకోసం తాడిపత్రి శివారులో స్థలాన్ని సేకరించారు. ఇక్కడ జీ ప్లస్‌ 2 సముదాయంగా ఏపీ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీటీఐడీసీఎల్‌) ఆధ్వర్యంలో నిర్మాణాలు  చేపట్టారు.  మిగిలిన ప్రాంతాల్లో స్థలమున్న వారికే ఇళ్లు మంజూరు చేశారు. అనంతపురం నగర పాలక సంస్థలో 2 వేలు, హిందూపురం 500, గుంతకల్లు 2 వేలు, ధర్మవరం 1,400, కదిరి వెయ్యి, రాయదుర్గంలో 1,307 ఇళ్లు మంజూరయ్యాయి.

యూనిట్‌ వ్యయంలో కోత
ఇంటి నిర్మాణం (400 అడుగులు) కోసం రూ. 4.80 లక్షలతో అధికారులు మొదట ప్రతిపాదించారు. ఇందులో రూ.1.50 లక్షలు మాత్రమే కేంద్రం భరిస్తుంది. రూ.80 వేలు రాష్ట్ర ప్రభుత్వం, రూ.50 వేలు లబ్ధిదారుడి వాటా కాగా.. మిగిలిన రూ.2 లక్షలు బ్యాంకు రుణం కింద ఇవ్వాలన్నది ప్రతిపాదన. అయితే.. తాజాగా మంజూరు చేసిన ఇళ్లకు సంబంధించి  ఒక యూనిట్‌కుS (323 అడుగులు) రూ.3.50 లక్షలు మాత్రమే ఇవ్వనున్నారు. కేంద్రం వాటాలో ఎలాంటి మార్పూ లేదు. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తుంది. లబ్ధిదారుడి వాటా రూ.25 వేలు ఉంటుంది.  బ్యాంకు రుణం రూ.75 వేలు అందనుంది.

ణం సాధ్యమేనా?
 బ్యాంకు రుణం పొందే విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కొన్ని పథకాలను బ్యాంక్‌ రుణంతో ముడిపెట్టడంతో ఆశించిన ప్రగతి కన్పించలేదు. లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. అయితే.. ఈ పథకానికి సంబంధించి కలెక్టర్‌ కోన శశిధర్‌ బ్యాంకర్ల సమావేశం నిర్వహించనున్నారు. జాబితా తుదిరూపు దాల్చాక ఎంత మందికి ఏయే బ్యాంకుల ద్వారా రుణాలు అందివ్వాలో తేల్చనున్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభం అయ్యాక విడతల వారీగా బిల్లులు చెల్లిస్తారు. రూఫ్‌ లెవల్‌కు రూ.లక్ష, రూఫ్‌ క్యాస్ట్‌ వరకు పూర్తయితే మరో రూ.లక్ష, నిర్మాణం పూర్తయ్యాక రూ.50 వేలను విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎప్పుడు చెల్లిస్తారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. లబ్ధిదారుల జాబితాను హౌసింగ్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచి నిర్మాణం ప్రారంభం నుంచి ఆన్‌లైన్‌లోనే బిల్లులు మంజూరు చేస్తారు.  

స్థలం లేని వారికి రెండో విడతలో మంజూరు : – ప్రసాద్, హౌసింగ్‌ పీడీ 

ఇంటి స్థలం ఉన్న వారు, లేని వారి జాబితాను వేర్వేరు చేస్తున్నాం. ప్రస్తుతానికి కొన్ని చోట్ల స్థల సమస్య ఉంది. డిమాండ్‌ సర్వే చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. మొదటి విడతగా మంజూరైన వాటిని ఆగస్టు 15న ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇంటి స్థలం లేని వారికి రెండో విడతలో మంజూరవుతాయి. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆదేశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు