స‌ర్వీస్ రోడ్ లా? పార్కింగ్ ప్లేస్‌లా?

18 Sep, 2016 22:05 IST|Sakshi
రింగ్‌రోడ్డుపై స‌ర్వీస్ రోడ్‌ల‌లో వాహ‌నాల పార్కింగ్‌

ప‌టాన్‌చెరు: నిత్యం ఎక్కడో ఒక చోటు రోడ్డు ప్రమాదం.. ర‌క్తపుటేరుల‌వుతున్న ర‌హదారులు. మృత్యుదేవ‌త ఆవాసంగా రోడ్లు. ఇటువంటి సంఘటలను  మ‌నం నిత్యం వింటూనే ఉంటాం. రోడు ప్రమాదాల్లో అభాగ్యులు ప్రాణాలు కోల్పోతూ వారి కుటుంబాల్లో శోకాన్ని మిగులుస్తున్నారు. ఈ ప్రమాదాల‌కు నిర్లక్ష్యమే కార‌ణ‌మ‌ని నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు.

ఈ నేప‌థ్యంల సాక్షి ప‌టాన్‌చెరు జాతీయ ర‌హ‌దారిపై అస‌లు ప్రమాదాల‌కు కార‌ణాలేమిటో అన్వేషించింది. ప‌టాన్‌చెరు ప‌ట్టణం నుంచి వెళుతున్న జాతీయ ర‌హ‌దారి నిత్యం వేలాది వాహ‌నాల‌తో ర‌ద్దీగా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఉన్న రింగ్ రోడ్‌పై కూడా నిత్యం వేలాది వాహ‌నాలు రాక‌పోక‌లు సాగిస్తుంటాయి. అయితే జాతీయ ర‌హ‌దారితోపాటూ, రింగ్ రోడ్‌కు అనుబంధంగా స‌ర్వీస్‌రోడ్‌లు ఉన్నాయి.

ఇవి ఇప్పుడు పార్కింగ్ ప్లేస్‌లుగా మారిపోతున్నాయి. ప్రధానంగా ప‌టాన్‌చెరు నుంచి రుద్రారం వ‌ర‌కు  జాతీయ ర‌హ‌దారి వెంబ‌డే ఉన్న స‌ర్వీస్‌రోడ్‌ల‌లో వాహ‌నాలు ఎక్కడంటే అక్కడ నిలిపివేస్తున్నారు. కిలోమీట‌ర్ల మేర వాహ‌నాలు స‌ర్వీస్‌రోడ్‌ల‌లో గంట‌ల త‌ర‌బ‌డి నిలిచిపోతున్నాయి. రాత్రి 7 గంట‌ల నుంచి తెల్ల‌వారుజాము వ‌ర‌కు వంద‌లాది లారీలె స‌ర్వీస్‌రోడ్‌లోనే నిలిచిఉంటున్నాయంటే అతిశ‌యోక్తికాదు. 

రింగ్ రోడ్‌కు అనుకుని ఉన్న స‌ర్వీస్ రోడ్‌లో కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ముఖ్యంగా రింగ్‌రోడ్ నుంచి వాహ‌నాలు దిగే కూడ‌లి వ‌ద్ద ఉన్న స‌ర్వీస్‌రోడ్‌లో అయితే వంద‌ల సంఖ్యలో లారీలో గంట‌ల త‌ర‌బ‌డి నిలిచిపోతున్నాయి. హెవీ వెహిక‌ల్స్‌ను కూడా స‌ర్వీస్‌రోడ్‌ల‌లోనే పార్క్ చేస్తున్నారు. ప‌టాన్‌చెరు నుంచి వెళ్లే జాతీయ ర‌హదారిపై కానీ, రింగ్ రోడ్ స‌ర్వీస్ రోడ్లపై కాని లైటింగ్ వ్యవ‌స్థ ఉండ‌దు.

దీంతో రాత్రి వేళ‌ల్లోస‌ర్వీస్‌రోడ్‌ల‌లో ప్రయాణించే వారు ఆగి ఉన్న లారీల‌ను ఢీకొని నిత్యం ప్రమాదాల‌కు గుర‌వుతున్నారు. కొంత మంది అయితే ప్రాణాల‌ను కోల్పోతున్నారు. మ‌రికొంత మంది తీవ్రగాయాల‌తో ఆసుప‌త్రుల పాల‌వుతున్నారు. రింగ్‌రోడ్‌కు అనుబంధంగా ఉన్న స‌ర్వీస్ రోడ్‌లో వివిధ గ్రామాల‌కు నిత్యం వంద‌లాది మంది టూ వీల‌ర్‌, ఫోర్ వీల‌ర్‌ల‌లో వెళుతుంటారు.

వీరికి స‌ర్వీస్‌రోడ్‌ల‌లో పార్క్ చేసి ఉన్న వాహ‌నాలు రాత్రివేళ‌ల్తో క‌నిపించ‌క‌, ప్రమాదాలు జ‌రుగుతున్నాయి. సాధార‌ణంగా అయితే స‌ర్వీస్‌రోడ్‌ల‌లో వాహ‌నాలు నిలప‌కూడ‌దు. ఈ నిబంధ‌న‌ను తుంగ‌లో తొక్కి కొంత మంది లారీల య‌జ‌మానులు స‌ర్వీస్ రోడ్‌ల‌నే పార్కింగ్ ప్లేస్‌లుగా మార్చేస్తున్నారు. 

ముత్తంగి రింగ్‌రోడ్‌కు అనుకున్న ఉన్న స‌ర్వీస్‌రోడ్ వెంబ‌డే హోట‌ళ్లు విచ్చల‌విడిగా వెలియ‌డంతో వాహ‌నాల పార్కింగ్ అక్కడ మ‌రింత ఎక్కువైంది. దీంతో ఇక్కడ గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్ జామ్ కూడా అవుతోంది. దీనినే అదునుగా చేసుకుని కొంత మంది ద‌ళారులు పార్కింగ్‌కు ఫీజులు కూడా వ‌సూలు చేస్తుండ‌టం ఆశ్చర్యక‌ర‌మైన విష‌యం. 

ప్రమాదాల‌కు హేతువుగా ఉన్న ఈ పార్కింగ్‌ను నిత్యం పోలీసులు చూస్తున్నా, నిర్లక్ష్యంగానే వ్యవ‌హ‌రిస్తున్నారు. ద‌ళారులు, పోలీసులు కుమ్మకై స‌ర్వీస్‌రోడ్‌ల‌ను పార్కింగ్ ప్లేస్‌లుగా మార్చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్థానికులు మాట్లాడుతూ జాతీయ ర‌హ‌ధారితోపాటూ, రింగ్‌రోడ్‌కు అనుబంధంగా ఉన్న స‌ర్వీస్ రోడ్‌ల‌లో లారీల‌ను నిలిపివేస్తుండ‌టంతో ప్రమాదాలు నిత్యకృత్యమ‌వుతున్నాయ‌ని అంటున్నారు.

హెల్మెట్లేద‌ని,ఆర్సీ లేద‌ని మాటిమాటికి ఎక్కడంటే అక్కడ వాహ‌నాలు నిలిపివేసి చ‌లానాలు రాసే పోలీసుల‌కు స‌ర్వీస్‌రోడ్‌ల‌లో  పార్కింగ్ చేస్తు్న వాహ‌నాలు క‌నిపించ‌డం లేదా అని ప్రశ్నిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల‌కు వాహ‌న‌చోద‌కుల క‌న్నా, పోలీసులు నిర్లక్ష్యమే అధికంగా ఉంద‌ని, పోలీసులు లంచాల‌కు మ‌రిగి చేస్తున్న నిర్లక్ష్యం అభాగ్యుల ప్రాణాల‌ను హ‌రిస్తుంద‌ని ఆగ్రహిస్తున్నారు.

ఇప్పటికైనా జాతీయ ర‌హదారి, రింగ్ రోడ్ స‌ర్వీస్ రోడ్‌ల‌లో వాహ‌నాలు పార్క్ చేయ‌కుండా  చూడాల‌ని, మరీ ముఖ్యంగా ముత్తంగి రింగ్ రోడ్ వ‌ద్ద వంద‌లాదిగా వాహ‌నాలు పార్క్ చేయ‌బ‌డుతున్నాయ‌ని, దీనిపై వెంటనే క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు