బల్లకట్టుపై జీరో దందా..!

23 Jul, 2016 20:05 IST|Sakshi
బల్లకట్టుపై జీరో దందా..!
ఆంధ్రా నుంచి మట్టపల్లి బల్లకట్టు మీదుగా హుజూర్‌నగర్‌కు  వంటనూనె ప్యాకెట్లతో ప్రయాణిస్తున్న వాహనాన్ని ఇటీవల మట్టపల్లి పోలీసులు పట్టుకుని కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులకు అప్పజెప్పారు. సదరు వాహన డ్రైవర్‌ను ప్రశ్నించగా కొంతకాలంగా తాము అనుమతి లేకుండా నూనె ప్యాకెట్లతో పాటు తదితర వస్తువులను బల్లకట్ల మీదుగా రవాణా చేస్తున్నట్టు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ఇలా వంట నూనె ప్యాకెట్లతో పాటు నిషేధిత వస్తువులు, పన్నులు ఎగవేసేందకు వాహనాల తరలింపునకు సైతం బల్లకట్లు దోహదపడుతున్నాయని తెలుస్తోంది.
– హుజూర్‌నగర్‌ 
 
రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కృష్ణానదిపై నడుపుతున్న బల్లకట్లు అక్రమ రవాణాకు అడ్డాలుగా మారాయి. తెలంగాణ– ఆం«ధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య గల కృష్ణానదిపై ప్రయాణికుల రాకపోకలకు నియోజకవర్గంలోని మట్టపల్లి, చింతిర్యాల, బుగ్గమాదారంల వద్ద బల్లకట్లు తిప్పుతున్నారు. అయితే ప్రయాణికులను మాత్రమే ఇరువైపులా దాటించాల్సిన బల్లకట్లు అక్రమ సరుకులు, ఇతర ట్రాన్స్‌పోర్టులకు సంబంధించిన జీరో దందాకు సహకరిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బల్లకట్ల మీదుగా పీడీఎస్‌ బియ్యం, గుట్కాలు, మద్యం, నల్లబెల్లం వంటి నిషేధిత సరుకుల రవాణా జరుగుతున్నాయని తెలిసింది. అయితే సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అంతేగాక సన్న బియ్యం, పత్తి, మిర్చి, ధాన్యం, సిమెంట్, క్లింకర్లతో పాటు పలు రసాయనాలను కూడా ఈ బల్లకట్ల మీదుగా సరిహద్దులు దాటిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పలు రకాల పన్నులను ఎగవేస్తున్నారని సమాచారం. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా సరిహద్దు ప్రాంతాలైన కృష్ణానది పరివాహక గ్రామాల ప్రధాన రహదారులపై ఎలాంటి చెక్‌పోస్టుల ఏర్పాటు లేకపోవడంతో అక్రమ రవాణాదారుల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. బల్లకట్ల నిర్వాహకులు సంపాదనే ధ్యేయంగా ఎటువంటి వస్తువుల రవాణానైనా సరిహద్దులు దాటిస్తుండటంతో ఈ అక్రమవ్యాపారాలకు అడ్డుకట్ట వేసేవారే లేకుండా పోయింది. 
నిబంధనలకు విరుద్ధంగా..
నిబంధనలకు విరుద్ధంగా బల్లకట్లు రాత్రివేళలో కూడా యథేచ్ఛగా నడుపుతూ అక్రమార్కులకు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బల్లకట్ల నిర్వహణ నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నడపాల్సి ఉన్నప్పటికీ వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కిష్ణపట్టె ప్రాంతాలైన దొండపాడు,మట్టపల్లి, చింతిర్యాల వద్ద ప్రధాన రహదారిపై మూడు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపడితే ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రా సరిహద్దులను దాటి రాష్ట్రంలోకి ప్రవేశిం చేందుకు ట్రాన్స్‌పోర్టు వాహనాలకు అనుమతులు తప్పనిసరి కావడంతో సదరు అనుమతుల కోసం చెల్లించాల్సిన వేలాది రూపాయల బోర్డర్‌ ట్యాక్స్‌ను ఎగ్గొడుతూ బల్లకట్ల మీదుగా ప్రయాణిస్తున్నారు. అంతేగాక జాతీయ రహదారిపై గల కోదాడ మండలంలోని నల్లబండగూడెం క్రాస్‌రోడ్డు నుంచి రెడ్లకుంట, కాపుగల్లు, గుడిబండ వద్ద నుంచి జగ్గయ్యపేట, దొండపాడు, మల్లారెడ్డిగూడెం మీదుగా గల రహదారుల ద్వారా ఆంధ్రాప్రాంతానికి చెందిన అనేక ట్రాన్స్‌పోర్టులకు చెందిన ఆంధ్రా వాహనాలు ఆయా బల్లకట్లకు చేరుకొని సరిహద్దులు దాటిస్తున్నారు. ఎటువంటి పన్నులు చెల్లించకుండానే సరిహద్దులు దాటుతుండటంతో బల్లకట్లపై ట్రాన్స్‌పోర్టు వాహనాల ప్రయాణం రోజు రోజుకూ పెరిగిపోతోంది.  ప్రభుత్వం ఇప్పటికైనా బల్లకట్ల సమీపంలో గల ప్రధాన రహదారులపై  చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ వ్యాపారాలకు చెక్‌ పెట్టాలని పలువురు కోరుతున్నారు. 
 
 
 
మరిన్ని వార్తలు