అక్రమ రవాణాకు చెక్‌

27 Jul, 2017 23:12 IST|Sakshi
అక్రమ రవాణాకు చెక్‌
నూతన జీఎస్టీ విధానంతో జరిగిన మేలు
పప్పులు, నూనెలపై ఏకీకృత పన్ను విధింపు
ఇంత వరకూ ఐదు శాతం పన్ను ఎగవేతకు 
వ్యాపారుల ఆపసోపాలు
యానాం నుంచి నిలిచిన అక్రమ సరుకు దిగుమతులు
చెక్‌పోస్టు ఎత్తివేత
అమలాపురం టౌన్‌ : దేశ వ్యాప్త జీఎస్టీ విధానంతో రాష్ట్రాల మధ్య పన్నుల వత్యాసాలు చెరిగిపోయాయి. ఒక రాష్ట్రంలో పన్నులు లేని కొన్ని వస్తువులను ఇతర రాష్ట్రాల వ్యాపారులు దిగుమతి చేసుకునే అక్రమ రవాణాలు ఆగిపోయాయి. దీంతో మన జిల్లాలో అంతర్భాగమై ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్ర పరిధిలోని ఫ్రెంచి యానాం నుంచి నిత్యం జరిగే వివిధ ఆహార దినుసులు, అపరాల తదితర వస్తువుల అక్రమ రవాణాకు సైతం అడ్డుకట్ట పడింది. పుదిచ్ఛేరి రాష్ట్రానికి పన్నుల పరంగా కొన్ని వెసులబాట్లు ఉండేవి. దాంతో అక్కడి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాలకు భారీ ఎత్తున సరుకు అక్రమంగా రవాణా అయ్యి జిల్లాలో పన్నుల ఎగవేత జరిగేది. ఇప్పుడు జీఎస్టీతో ముఖ్యంగా పప్పు ధాన్యాలు, వంట నూనెలు, చక్కెర తదితర ఆహార వస్తువులపై సమాంతర పన్నులు విధించటంతో ఒక విధంగా అక్రమ రవాణా నిలిచిపోయింది
5 శాతం పన్ను ఎగవేత కోసం..
ఫ్రెంచి యానాంలో అన్ని రకాల పప్పు ధాన్యాలు, వంట నూనెలు తదితర ఆహార వస్తువులపై 0 శాతం పన్ను అమలయ్యేది. అదే మన రాష్ట్రంలో వాటిపై 5 శాతం పన్ను ఉండేది. ఈ పన్ను ఎగవేతకు కొందరు వ్యాపారులు అక్కడి నుంచి పప్పులు, నూనెలను జిల్లాలోకి అక్రమంగా రవాణా చేసి కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం ప్రాంతాలకు తరలించేవారు. దీని వల్ల జిల్లా వాణిజ్య పన్నుల శాఖకు రోజుకు రూ.పది లక్షల చొప్పున, నెలకు రూ.మూడు కోట్ల నష్టం వాటిల్లేది. ఒడిషా నుంచి వంట నూనె పీపాల లారీలు, ఇతర రాష్ట్రాల నుంచి పప్పుల లారీల సరుకు ఫ్రెంచి యానానికి దిగుమతి అవుతున్నట్లు బిల్లులు ఉండేవి. అవి మన జిల్లాలోని బడా హోల్‌సేల్‌ వ్యాపారాలకు చేరేవి. ఇదంతా ఓ రాకెట్‌లా సాగేది. అమలాపురానికి రెండు రోజులకోసారి ఫ్రెంచి యానాం బిల్లుతో వచ్చిన పప్పులు, వంట నూనెల లారీలు అక్రమ రవాణాతో వచ్చి రహస్యంగా దిగుమతి అయ్యేవి.
చెక్‌ పోస్టు ఎత్తివేత : పన్నుల వ్యత్యాసం, సరిహద్దు సమస్యతో జిల్లా వాణిజ్య పన్నుల శాఖ ఫ్రెంచి యానాం నుంచి అక్రమ రవాణాలను అరికట్టేందుకు కొన్నేళ్ల కిందట యానాం సమీపంలోనే ఓ చెక్‌పోస్టు పెట్టింది. యానాం నుంచి 0 శాతం పన్నుల సరుకులను జిల్లాలోకి ప్రవేశించకుండా ఈ దీనిని ఏర్పాటు చేసినప్పటికీ జీఎస్టీ అమలు తరువాత ఎత్తివేశారు. అయితే జీఎస్టీ నుంచి మద్యం, డీజిల్, పెట్రోలులకు మినాహాయింపు ఉండటంతో యానంలో వాటికి ఉన్న తక్కువ ధరల వెసులబాటు అలానే కొనసాగుతోంది.
మరిన్ని వార్తలు