ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

29 Jul, 2017 23:56 IST|Sakshi
మెట్ట ఉప్పరగూడెంలో దారుణం
మృతురాలే కుటుంబ జీవనాధారం
రోడ్డున పడ్డ తండ్రి, ఏడేళ్ల కుమారుడు 

తాడేపల్లిగూడెం రూరల్‌ : 
కరకు కసాయి చేతిలో ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. ఈ సంఘటన మండలంలోని మెట్ట ఉప్పరగూడెం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన నాయుడు ప్రశాంతి (25)కి ఎనిమిదేళ్ళ క్రితం నల్లజర్ల మండలం తెలికిచర్ల గ్రామానికి చెందిన నాయుడు కొండయ్యతో వివాహమైంది. వారికి కిరణ్‌కుమార్‌ (7) అనే బాబు ఉన్నాడు. ఐదేళ్ళ కాపురం అనంతరం వారిరువురి మ«ధ్య తగాదాలు రావడంతో విడిపోయారు. అనంతరం పుట్టినిల్లయిన మెట్ట ఉప్పరగూడెం గ్రామం కొత్తపేట రోడ్డు 1వ వార్డులో ఒక అద్దె ఇంటిలో తండ్రి లక్ష్మయ్య, కుమారుడు కిరణ్‌కుమార్‌లతో కలిసి ప్రశాంతి నివాసముంటోంది. అయితే మూడేళ్లుగా ప్రశాంతి ఎల్‌.అగ్రహారం గ్రామానికి చెందిన పాండురంగడు (రంగడు)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో పెద్దల సమక్షంలో వారిని మందలించారు. దీంతో వారు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో వేరే వ్యక్తితో ప్రశాంతి సన్నిహితంగా ఉండటం చూసిన రంగడు ఓర్వలేక ఆమెతో గొడవ పడ్డాడు. శనివారం ఉదయం ప్రశాంతి ఇంటికి వచ్చి ఆమెపై కొడవలితో పాశవికంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. చుట్టుపక్కల వారు వచ్చేలోపే మోటారు సైకిల్‌పై రంగడు అక్కడ నుంచి ఉడాయించాడు. 
 
మృతురాలి అన్న చిటకన శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు పట్టణ, రూరల్‌ ఎస్‌ఐలు సీహెచ్‌.ఆంజనేయులు, బి.శ్రీనివాస్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. నిందితుడు రంగడుకు వివాహమై భార్య, మూడేళ్ళ కుమారుడు ఉన్నారు. నిందితుడు రంగడును ఎల్‌.అగ్రహారం గ్రామంలో రూరల్‌ ఎస్‌ఐ బి.శ్రీనివాస్‌ అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ మూర్తి తెలిపారు. 
రోడ్డున పడ్డ కుటుంబం : 
మృతురాలు ప్రశాంతి ఆ కుటుంబానికి జీవనాధారం. కూలీ నాలీ చేసుకుని కుటుంబాన్ని పోషిస్తోంది. తల్లి చనిపోగా తండ్రి లక్ష్మయ్యతో కలిసి ఉంటోంది. ఈమె మృతి చెందడంతో తండ్రి లక్ష్మయ్య, కుమారుడు కిరణ్‌కుమార్‌ (7)లు రోడ్డున పడ్డారు. వీరు అనాథలుగా మారారు. దీంతో వారి పరిస్థితి చూసి చుట్టుపక్కల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వార్తలు