పరిస్థితులు ఊహించే ఆత్మహత్య?

1 Aug, 2016 12:26 IST|Sakshi
పరిస్థితులు ఊహించే ఆత్మహత్య?

  ఒకే కుటుంబంలో నలుగురి బలవన్మరణం ఘటన
♦  సత్యనారాయణ కుటుంబం చాలాకాలంగా బంధువులకు దూరం
♦  మృతదేహాన్ని ఎటు తీసుకెళ్లాలో తెలియక అయోమయం
♦  ఆ సంఘర్షణతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం

ఘట్‌కేసర్‌: మృతదేహన్ని సొంతూరుకు తీసుకెళ్తే ఎదరయ్యే వ్యతిరేకతకు భయపడే నలుగురు ఆత్మహత్య  చేసుకొని ఉంటారని మృతుల సమీప బంధువులు ఆదివారం తెలిపారు. వరంగల్‌ జిల్లా మద్దూరు మండలం లద్నూరు గ్రామానికి చెందిన పారుపల్లి సత్యనారాయణ (55) అనారోగ్యంతో మృతి చెందగా  భార్య మీరా, కూతుళ్లు స్వాతి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణ  అంకుశాపూర్‌ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సత్యనారాయణ ఆదిలాబాద్‌ జిల్లాలో హౌసింగ్‌ డీఈగా పనిచేస్తున్నారు. భార్యాపిల్లలు హన్మకొండలోని టీచర్స్‌ కాలనీలో ఉంటున్నారు. తల్లిదండ్రులు లద్నూరులోనే నివాసం ఉంటున్నారు. ఆరోగ్యం దెబ్బతినడంతో సత్యనారాయణను చికిత్స నిమిత్తం తరలిస్తుండగా భువనగిరిలో మృతిచెందాడు. అయితే మృతదేహన్ని ఎక్కడికి తీసుకెళ్లి కర్మకాండలు నిర్వహించాలనే సమస్య కుటుంబసభ్యులకు ఎదురైంది.   హన్మకొండలో అద్దె ఇంట్లో కర్మకాండలకు ఇంటివారు అనుమతించారు. మీరాకు తల్లిగారింటితోనూ సత్సంబంధాలు లేవు. చాలాకాలంగా సత్యనారాయణకు తల్లిదండ్రులకు రాకపోకలు లేవు. ఇన్నేళ్ల తరువాత మృతదేహాన్ని తీసుకెళ్తే ఇప్పుడు గుర్తొచ్చామా అంటారు. ఈ  వ్యతిరేకతకు భయపడే ఆత్మహత్య చేసుకుని ఉంటారని బంధువులు భావిస్తున్నారు.

ధైర్యం చెప్పేవాళ్లం..
సత్యనారాయణకు ఇద్దరు సోదరులు రవీందర్‌,  శ్రీనివాస్‌ ఉన్నారు. మీరాతో పాటు మరో ముగ్గురు అక్కాచెల్లెళ్లు వారి భర్తలు, పిల్లలు ఉన్నారు. వారిలో ఎవరికైన మృతి చెందిన సమాచారం అందించవచ్చు. వారు అలా చేయలేదు. సమాచారం ఇచ్చి ఉంటే తాము ధైర్యం చెప్పేవారమని బంధువులు అంటున్నారు. కుమిలిపోయి, మానసిక సంఘర్షణతో చావే పరిష్కారమని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు పెళ్లీడుకొచ్చిన పిల్లలకు వివాహాలు కాకపోవడం కూడా ఆందోళనకు కారణమై ఉంటుందన్నారు.

డీఈగా రెండు సంవత్సరాలే..
సత్యనారాయణ హౌసింగ్‌ బోర్డులో ఏఈగా వరంగల్‌, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాలో పనిచేసి సస్పెండ్‌కు గురయ్యారు. చాలకాలం విరామం తరువాత డీఈగా ప్రమోషన్‌పై ఆసిఫాబాద్‌కు బదిలీపై వెళ్లారు. మద్యానికి బానిసై ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేదు. అక్కడ రెండేళ్లే పనిచేసి మృతిచెందారు.  

కొత్తకారు సంబరం నాలుగు రోజులే..
కొత్తకారు తీసుకొని గత నెల 26న రిజిస్టర్‌ చేయించారు. నాలుగురోజులే అందులో తిరిగారు. మృతుని కుమారుడు శివరామకృష్ణ డ్రైవింగ్‌ చేసేవాడు. 29న తండ్రి మృతితో వారు సైతం రైల్వేట్రాక్‌పై తలలు పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. చివరిసారి నల్లగొండ జిల్లాలో భువనగిరిలోని హోటల్‌లో భోజనం చేస్తే , ఘట్‌కేసర్‌ మండలం అంకుశాపూర్‌లో తుదిశ్వాస వదిలారు.

గతంలోనూ ఇలాంటి సంఘటనలు..
గతంలో మండలంలోని కొండాపూర్‌కు బతుకుదెరువు నిమిత్తం ఓ రాజస్థానీ కుటుంబం వచ్చింది. రూ.10లక్షలకు గ్రామస్తుడొకరు టోకరా ఇవ్వడంతో కుటుంబం మొత్తం రైల్వేట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడింది.  అంతకు ముందు మైసమ్మగుట్టకు చెందిన కూలీ ఒకరు కూలీపనులు చేస్తూ జీవనం సాగించేవాడు. రూ.50వేలు అప్పు కావడంతో కుటుంబం మొత్తం ఇలాగే బలవన్మరణానికి పాల్పడింది. దానికంటే ముందు నగరంలోని ముషీరాబాద్‌కు చెందిన ఓ యువతి తన చిన్నారి కూతురుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.

>
మరిన్ని వార్తలు