సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం

12 Dec, 2016 13:53 IST|Sakshi
సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం
- పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి 
- వైఎస్‌ జగన్‌ ఎదిగే నాయకుడు 
- విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ
 
ఎమ్మిగనూరు:  సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం, పెండింగ్‌ పనులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చి జిల్లాలోని ఆయకట్టుకు పుష్కలంగా నీరిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూశాఖా మంత్రి, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఎమ్మెల్యే డా.బి. జయనాగేశ్వరరెడ్డితో కలసి ఆదివారం ఆయన ఎమ్మిగనూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హంద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా డోన్, పత్తికొండ, ఆలూరు ప్రాంతాల ఆయకట్టుకు నీరు అందుతోందన్నారు. ఈ ప్రాజెక్టు కాలువ విస్తరణకు రూ.1300 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదిగే నాయకుడని, ఆయనకు మరింత భవిష్యత్తు ఉందన్నారు. అయితే ఇప్పటి నుంచే సీఎం కుర్చీపై కాకుండా ప్రజల పక్షాన పోరాడాలని సూచించారు. రాష్ట్రాన్ని దారుణంగా విడగొట్టిన పాపం కాంగ్రెస్‌దని, ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కేంద్ర మాజీ మంత్రి ఇప్పుడేమో రైతుల కోసం పోరాడుతున్నట్లు కవరింగ్‌ ఇచ్చుకునేందుకు డిల్లీ నాయకులతో సమావేశాలు పెట్టారని ఎద్దేవా చేశారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం ఏర్పడిందని చెప్పిన కేఈ.. అందువల్లే అంబూజ, సోలార్జీ, ఏరోడ్రమ్‌ కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. అనంతరం ఎమ్మిగనూరులో ఇండోర్‌ స్టేడియం, నందవరం రెవెన్యూ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమాల్లో జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ పుష్పావతి, ఎంపీపీలు నరసింహారెడ్డి, శంకరయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొండయ్య చౌదరి, మార్కెట్‌యార్డు చైర్మన్‌ సంజన్న, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఈరన్నగౌడ్, దేశాయ్‌మాధవరావు,  బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు విక్రమ్‌కుమార్‌గౌడ్, ఆర్డీఓ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.  
 
మరిన్ని వార్తలు