మూడు నెలల్లో

26 Jul, 2016 22:23 IST|Sakshi
మూడు నెలల్లో
రత్నగిరిపై యోగ, ఆయుర్వేద వైద్య సేవలు
‘సాక్షి’ వార్తలతో దిగివచ్చిన ‘బెంగళూర్‌ యోగ, ఆయుర్వేద యూనివర్సిటీ
సహజ ఆసుపత్రిని సందర్శించిన యూనివర్సిటీ ప్రతినిధులు
అన్నవరం :
అన్నవరం దేవస్థానంలో అధునాతన పరికరాలతో యోగ, ఆయుర్వేద వైద్యం అందిస్తామని చెప్పి బెంగళూరులోని వివేకానంద యోగ, ఆయుర్వేద యూనివర్సిటీ రూ.30 లక్షలు తీసుకుని నాలుగునెలలైనా పనులు ప్రారంభించకపోవడంపై ‘సాక్షి’ ఈనెల 21న ‘ఆ యోగం కలిగేనా?’ శీర్షికన ప్రచురించిన కథనానికి దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించండంతో బెంగళూరు యూనివర్సిటీ అధికారులు దిగివచ్చారు. మంగళవారం అన్నవరం దేవస్థానానికి ఆ యూనివర్సిటీ హైదరాబాద్‌ విభాగ సభ్యుడు కేఎస్‌ఆర్‌ మూర్తి, ప్రతినిధి సుందరరామయ్య, ఇంజినీర్‌ బుచ్చిరాజు తదితరులు వచ్చారు. అక్టోబర్‌ నాటికల్లా పనులన్నీ పూర్తి చే యించి, యోగా, ఆయుర్వేద వైద్యం ప్రారంభిస్తామని చెప్పారు. అంతేకాదు దేవస్థానం చైర్మన్‌ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావులతో కలసి సహజ ప్రకృతి చికిత్సాలయాన్ని సందర్శించి, యోగ, ఆయుర్వేద వైద్యం కోసం అందులో చేయాల్సిన మార్పులపై చర్చించారు.  
సహజ ఆసుపత్రిని కిందకు మారుస్తాం 
ప్రస్తుతం దేవస్థానం నిర్వహిస్తున్న సహజ ప్రకృతి చికిత్సాలయంలో 26 మంది ఇన్‌పేషెంట్లుగా ఉన్నారు. వివేకానంద యోగ యూనివర్సిటీ ప్రారంభించనున్న యోగ, ఆయుర్వేద వైద్యం కోసం సహజ  భవనంలో మార్పులు చేయడానికి వీలుగా తాత్కాలికంగా సహజ ఆసుపత్రిని కొండదిగువన దేవస్థానం ఆసుపత్రికి మారుస్తాం. వారు భవనంలో ఏ మార్పు చేయడానికైనా సహకరిస్తాం. సాధ్యమైనంత త్వరగా యోగ, ఆయుర్వేద వైద్యం అందించాలన్నదే మా ధ్యేయం.
– కే నాగేశ్వరరావు, ఈఓ 
మార్పులు శాశ్వతంగా ఉండేలా చేయాలి
వివేకానంద యూనివర్సిటీకి 11 సంవత్సరాలు మాత్రమే యోగ, ఆయుర్వేద వైద్యం అందించడానికి దేవస్థానం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తరువాత ఈ భవనంలో దేవస్థానం సొంతంగా ఈ వైద్యం అందించడానికి వీలుగా భవనంలో మార్పులు ఉండాలి. మరలా మేము కొత్తగా మార్పులు చేసుకునేలా ఉండకూడదు. అందుకే ఏ మార్పులు చేయాలని అనుకుంటున్నారో! వాటిని ప్లాన్‌ రూపంలో అందజేయాలని కోరాం.– ఐవీ రోహిత్, దేవస్థానం చైర్మన్‌ 
 
మూడు నెలల్లో మార్పులు చేసి వైద్య సేవలందిస్తాం
యూనివర్సిటీ నిపుణులు అందించే యోగ, నేచురోపతి, ఆయుర్వేదం వైద్యం కోసం సహజ ప్రకృతి చికిత్సాలయ భవనంలో  మార్పులు చేయాల్సి ఉంది. వాస్తు రీత్యా ప్రస్తుతం ఉన్న మార్గాన్ని మూసి, ఉత్తరం వైపునుంచి మార్గం ఏర్పాటు చేస్తాం. అక్కడి ఘాట్‌ రోడ్‌లో నుంచి ర్యాంప్‌ ఏర్పాటు చేస్తాం. గదులన్నీ ఆధ్యాత్మికత, ప్రశాంత వాతావరణం ఉట్టిపడేలా తయారు చేస్తాం. స్పీనల్‌ స్ప్రే, హిప్‌ బాత్, ఫుట్‌ అండ్‌ హార్మ్‌ బాత్, అండర్‌ వాటర్‌ మసాజ్, లోకల్‌ స్టీమ్‌ బాత్‌ తదితర 20 యోగ, ఆయుర్వేద చికిత్సలు ఇక్కడ నిర్వహించేంలా మార్పులు  చేస్తాం. శిరోధార, మడ్‌ బాత్, వంటివి కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ప్రస్తుతం సహజలో దేవస్థానం ఒక రోజు చికిత్సకు రూ.250 వసూలు చేస్తోంది. అయితే మేము చేసే చికిత్సలో మూడు రకాల ఫీజులు ఉంటాయి. రూ.500 నుంచి రూ.వేయి వరకూ వసూలు చేస్తాం. దానికి తగ్గట్టుగానే వైద్యం లభిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోను అక్టోబర్‌లో ఈ వైద్యం ప్రారంభమయ్యేలా చేస్తాం.
– కేఎస్‌ఆర్‌ మూర్తి
 
>
మరిన్ని వార్తలు