ఈసారైనా న్యాయం జరిగేనా?

14 Nov, 2016 01:12 IST|Sakshi
ఈసారైనా న్యాయం జరిగేనా?
- గత ఏడాది పప్పుశనగ రైతులకు అందని బీమా  
- వెనక్కొచ్చిన ‘ప్రీమియం’ డీడీలు 
- ఈసారి జిల్లా వ్యాప్తంగా 10 వేల హెక్టార్లలో పప్పుశనగ సాగు 
వజ్రకరూరు : పప్పుశనగ రైతులకు ఈసారైనా బీమా పరిహారం అందేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది గడువు ముగిశాక ప్రీమియం కట్టారన్న నెపంతో వేలాది మంది రైతులకు పరిహారం అందలేదు. పైగా వారు చెల్లించిన ప్రీమియం డీడీలను వెనక్కి ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఈసారైనా అధికారులు అప్రమత్తమై రైతులకు న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరముంది. ఈ రబీ సీజ¯ŒSలో జిల్లా వ్యాప్తంగా దాదాపు పది వేల హెక్టార్లలో పప్పుశనగ సాగు చేశారు. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం దాదాపు లక్ష హెక్టార్లు కాగా..వర్షాభావం కారణంగా పది వేల హెక్టార్లకే పంట పరిమితమైంది. ఇందులో కూడా అత్యధికంగా వజ్రకరూరు, తాడిపత్రి, ఉరవకొండ, పెద్దపప్పూరు, యల్లనూరు మండలాల్లో సాగు చేశారు. మిగిలిన మండలాల్లో అరకొరగా వేశారు. ఒక్క వజ్రకరూరు మండలంలోనే దాదాపు ఐదు వేల హెక్టార్లలో వేశారు. రైతులు క్వింటాల్‌ విత్తనానికి రూ.9,700 పెట్టి కొనుగోలు చేశారు. ప్రస్తుతం తీవ్ర వర్షాభావం కారణంగా  పంట ఎండుముఖం పట్టింది. ఈ పరిస్థితుల్లో పప్పుశనగకు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన వర్తింపునకు సంబంధించి రైతులకు ఎలాంటి సమాచారమూ లేదు. దీంతో వారు ఆందోâýæన చెందుతున్నారు. 
 
గత ఏడాది తీవ్ర నష్టం 
గత రబీ సీజన్లో ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా నల్లరేగడి భూముల్లో పప్పుశనగ, జొన్న, ధనియాలు తదితర పంటలను సాగు చేసిన రైతులు వర్షాభావం కారణంగా తీవ్రంగా నష్టపోయారు. అప్పట్లో వారు  జాతీయ వ్యవసాయ బీమా పథకం కింద పప్పుశనగకు బీమా ప్రీమియం కూడా చెల్లించారు. అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పేరుపై ఎకరాకు రూ.180 చొప్పున డీడీలు కట్టారు. పంట ఎండిపోవడంతో పరిహారం తప్పక వస్తుందని ఆశించారు. అయితే..వారికి పరిహారం రాకపోగా ప్రీమియం డీడీలు వెనక్కి వచ్చాయి. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు తమకు చేరాయని, పంట వేసిన తేదీ కూడా వ్యవసాయ బీమా పథకం నియమ నిబంధనలకు లోబడి లేదని, రైతు సంతకంతో పాటు పంట వేసినట్లు సంబంధిత అధికారి ధ్రువీకరణ లేదని, కావున డీడీలు వెనక్కి పంపుతున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని వారు కోరుతున్నారు.   
 
>
మరిన్ని వార్తలు