ఓయూలో ఎంపీ సీతారాం ఘెరావ్

8 Oct, 2015 01:12 IST|Sakshi
ఓయూలో ఎంపీ సీతారాం ఘెరావ్

 హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు టీఆర్‌ఎస్ ఎంపీ ప్రొ.సీతారాం నాయక్‌ను ఘెరావ్ చేశారు. బుధవారం క్యాంపస్‌లోని లైబ్రరీలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న ఎంపీని విద్యార్థులు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్, ఎస్టీ రిజర్వేషన్ల సాధన కమిటీ చైర్మన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి తొత్తుగా మారిన ఎంపీ ప్రొ.సీతారాం నాయక్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలని, గ్రూప్-2లో ఇంట ర్వ్యూ విధానాన్ని ఎత్తివేయాలని, ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లను పెంచాలని, సీఎం కేసీఆర్ ప్రకటించిన ఓయూ విద్యార్థుల రూ.9 కోట్ల మెస్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌కు తాకట్టుపెట్టిన ఎస్టీ ప్రజాప్రతినిధులకు తగిన బుద్ధిచెప్పాలన్నారు.

 అనంతరం ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ విద్యార్థులవి న్యాయమైన డిమాండ్లని, ఐదుగురు విద్యార్థి నాయకులు తన వెంట వస్తే సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తానని తెలిపారు. అనంతరం పోలీసుల సహకారంతో లైబ్రరీ లోపలి నుంచి బయటకు వచ్చిన ఎంపీ తన వాహనంలో వెళ్లిపోయారు. ఘెరావ్ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు నరేందర్‌పవార్, అర్జున్‌బాబు, రవీంద్రనాయక్, సుబ్బు, శ్రీకాంత్, శ్యాం, నవీన్, రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

 బంజారా విద్యార్థుల ఖండన..
 ఓ గిరిజన  ఎంపీని అడ్డుకోవడం దుర్మార్గమని ఆల్ బంజారా విద్యార్థి సంఘం అధ్యక్షుడు, టీఎస్‌జాక్ చైర్మన్ కరాటే రాజు, టీఆర్‌ఎస్వీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవితేజా, టీఆర్‌ఎస్ నేతలు  శంకర్‌నాయక్, నెహ్రునాయక్ పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సాకూలంగా ఉందని తెలిపారు.

మరిన్ని వార్తలు