చిట్టితల్లీ.. సుఖీభవ

25 Jun, 2016 14:13 IST|Sakshi

జ్ఞానసాయికి సాయం అందించేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం
వరుస కథనాలతో చిన్నారికి అండగా నిలిచిన ‘సాక్షి’
స్పందించిన అనేక మంది దాతలు

 

ములకలచెరువు : మండలంలోని వేపూరికోట పంచాయతీ బత్తలాపురానికి  చెందిన జె.రమణప్ప, సరస్యతి దంపతుల కుమార్తె జ్ఞానసాయికి పూర్తిస్థాయి వైద్యసేవందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివరాల్లోకి వెళితే.. చిన్నారి జ్ఞానసాయికి కాలేయం పూర్తిగా దెబ్బతినడంతో కాలేయ మార్పిడి కోసం రూ. 15 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీనిపై బాధితులు సాక్షిని సంప్రదించగా దాతలసాయం కోసం ఈ నెల 16వ తేదీ ‘ పసిమొగ్గకు ప్రాణం పోయండి‘ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం వెలువడింది. వెంటనే స్పందించిన ములకలచెరువు సీఐ రుషికేశవ్ చిన్నారి కుటుంబ సభ్యులకు రూ.7,500 వేలను నగదు రూపంలో అందించారు. అనంతరం మరుసటి రోజు పుత్తూరుకు చెందిన చిరంజీవి అనే దాత రూ. 3 వేలను చిన్నారి తల్లి జే. సరస్వతి బ్యాంకు ఖాతాలో జమచేశారు. తర్వాత ములకలచెరువు కస్తుర్బా పాఠశాలకు చెందిన టీచర్ నిర్మలమ్మ రూ. వెయ్యి, అదే పాఠశాలకు చెందిన విద్యార్థిణి చందన రూ.500లను బాధితులకు అందించారు. వరుసగా దాతల సహాయంపైన  సాక్షిలో కథనాలు వెలబడుతుండడంతో స్థానిక ములకలచెరువుకు చెందిన వ్యాపారస్తుడు నరసింహులు మూడు రోజుల క్రితం బాధితులకు రూ. 5 వేలను చిన్నారి వైద్యం కోసం చేయూత నిచ్చారు.

 
కారుణ్య మరణం కథనంతో వెలుగులోకి..

పేద కుటుంబం కావడంతో చిన్నారి వైద్యం కోసం డబ్బు వెచ్చించే స్థోమత లేదని కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని  బాధితులు గురువారం తంబళ్లపల్లె, మదనపల్లె కోర్టులో పటిషన్ వేశారు. ఈ విషయంపై శుక్రవారం పసిమొగ్గకు ఎంతకష్టం శీర్షికతో సాక్షిలో కథనం వెలువడింది. దీనిపై ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చిన్నారికి వైద్యం చేయిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు చిన్నారి తండ్రి జే.రమణప్పకు శుక్రవారం ఫోను ద్వారా సమాచారం అందించారు.  అనంతరం చిన్నారి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని మదనపల్లె సబ్‌కలెక్టర్ కృతికాబాత్రాకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశించినట్లు సమాచారం. సబ్‌కలెక్టర్ ములకలచెరువు తహశీల్దార్ అమరేంద్రబాబుకు చిన్నారి వివరాలు, జబ్బుకు అయ్యే ఖర్చుపై నివేదిక అందివ్వాలని అదేశించడంతో రెవెన్యూ అధికారులు ఒక్కసారిగా బాధితుల ఇంటి వద్దకు ఆగమేఘాలపైన పరుగులు తీశారు. బాధితులు ఇంటి వద్ద లే కపోవడంతో ఫోను ద్వారా వివరాలు సేకరించారు. అనంతరం సబ్‌క లెక్టర్‌కు నివేదిక పంపించారు. ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం చిన్నారిని హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు.


పరీక్షల అనంతరం చిన్నారికి ఆపరేషన్ నిర్వహించి కాలేయం మార్పిడి చేయనున్నారు. తల్లీదండ్రులలో ఒక్కరికి ఆపరేషన్ చేసి వారి నుంచి కొద్దిబాగం కాలేయాన్ని తీసి చిన్నారికి అమర్చనున్నట్లు సమాచారం. వీటి మొత్తానికి సుమారుగా రూ. 25 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు అంచనా చేస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరావడంతో చిన్నారి కుటుం సభ్యుల కళ్లలో ఆనందం కనిపించింది. సాక్షిలో కథనాలకు స్పందన రావడంతో చిన్నారి తల్లిదండ్రులు సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు