రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

11 Sep, 2016 02:56 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

నల్గొండ జిల్లా : రోడ్డు ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం చెందగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘటన సంస్థాన్‌ నారాయణపురం మండలం మహ్మదాబాద్‌ శివారులో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  వావిళ్లపల్లి గ్రామపరిధి ఆంగోతుతండాకు చెందిన మహింద్ర మాక్స్‌ చౌటుప్పల్‌ నుంచి తొమ్మిది మంది ప్రయాణికులతో  చిల్లాపురం వస్తోంది. అతివేగంగా వస్తూ, అదుపు తప్పి మహ్మదాబాద్‌ శివారులో ఫల్టీకొట్టింది. మొదటి ఫల్టీలోనే అందులోని ప్రయాణికురాలు భుక్యా సునిత(19) కిందపడింది. మహింద్ర మాక్స్‌ ఆమె మీద పడి మరో రెండు ఫల్టీలు కొట్టడంతో సునిత అక్కడికక్కడే మృతిచెందింది.

 డ్రైవర్‌ జాన్‌తో పాటు  అందులో ప్రయాణిస్తున్న లక్ష్మీ,కె.లక్ష్మమ్మ, విజయమ్మ, కె.శివ, కె.శ్రీహర్ష, మేడిపల్లి నరేష్, సతీష్‌కుమార్, శివకుమార్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.  క్షతగ్రాతులకు రోడ్డుపైన వెళ్తున్న యువకులు, ఎస్‌ఐ, ఏఎస్‌ శ్రీనివాస్‌రెడ్డి  సాయం చేశారు. వారిని చికిత్స నిమిత్తం 108, ఇతర వాహనాల ద్వారా చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి,  హైదరాబాద్‌కు తరలించారు.  చిల్లాపురం గ్రామానికి చెందిన సునిత, హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఉంటూ కంప్యూటర్‌ శిక్షణ నేర్చుకుంటోంది. సునిత తండ్రి రాములుమార్క్స్‌ చర్చి పాస్టర్‌గా పనిచేస్తూ, చిల్లాపురంలో నివాసం ఉంటున్నారు. వీరి సొంత గ్రామం ఖమ్మం జిల్లా గార్ల మండలం సూర్యతండా. తల్లి సరోజ రెండు రోజుల క్రితం సూర్యతండాకు వెళ్లింది.

 3రోజులు సెలవు వస్తుండడంతో, సునిత తల్లికి ఫోన్‌ చేసి, చిల్లాపురం రమ్మని చెప్పడంతో ఇదే రోజు వచ్చింది. అరగంట ముందు తల్లి సరోజ చిల్లాపురం గేటు వరకు చేరుకుంది. తన కూతురు వస్తుందని చిల్లాపురం రోడ్డుపైనే తల్లి ఎదురు చూస్తోంది. అరగంట ఆలస్యం కావడంతో, సునిత ప్రమాదానికి గురై మృతి చెందింది. అంతలోనే తల్లికి కూతురు చనిపోయిన చావు కబురు అందింది. సునితకు తమ్ముడు ఉన్నాడు. సునిత చనిపోవడంతో, చిల్లాపురంగ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి వచ్చారు. మృతదేహాన్ని నిమిత్తం పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ పి.అశోక్‌కుమర్‌ కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు