పింఛన్ల కోసం లోకాయుక్తలో కేసు

10 Jan, 2016 01:31 IST|Sakshi
పింఛన్ల కోసం లోకాయుక్తలో కేసు

♦ బాబుకు బుద్ధి చెబుదామంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
♦ అవ్వాతాతలంతా ఆధార్, రేషన్ కార్డులివ్వండి
♦ పోరాటం చేసి పింఛన్ సాధిద్దాం
♦ ఎన్నికల ముందు అందరికీ పెన్షన్లన్నారు...
♦ గెలిచాక ఎలా కత్తిరించాలా అని చూస్తున్నారు..
 
 రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘ఎన్నికల ముందు అందరికీ పింఛన్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పెన్షన్లు ఎలా కత్తిరించాలా అన్న దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. అవ్వాతాతలకు పింఛన్లు ఇవ్వడం లేదు. పింఛను రాని అవ్వాతాతలందరూ ఆధార్, రేషన్ కార్డులు ఇవ్వండి. పింఛన్లపై లోకాయుక్తలో కేసు వేసి పోరాటం చేద్దాం. చంద్రబాబుకు బుద్ధిచెబుదాం’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా కందుకూరులో తనకు పింఛన్ రావడం లేదంటూ బాల్‌రెడ్డిగారి శ్రీరామ్‌రెడ్డి అనే 75 ఏళ్ల వృద్ధుడు మొరపెట్టుకోవడంతో జగన్ కదిలిపోయారు.

అవ్వాతాతలందరికీ పింఛన్ అందేందుకు గాను లోకాయుక్తలో పోరాడదామని జగన్ హామీ ఇచ్చారు. రైతు భరోసా యాత్రలో భాగంగా నాలుగో రోజైన శనివారం నాలుగు కుటుంబాలను జగన్ పరామర్శించారు. రాప్తాడు నియోజకవర్గం కందుకూరులో హాజరైన భారీ జనసందోహాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు.  ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు.  అందుకే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ధైర్యం చెప్పి.. వారి కష్టాల గురించి చంద్రబాబుకు తెలిసేలా చేసేందుకే ఈ భరోసా యాత్ర చేపట్టినట్టు జగన్ వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

 బాబు కళ్లు తెరిపించేందుకే భరోసా యాత్ర
 ‘‘ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిందొకటి.. ఇపుడు చేస్తున్నదొకటి.. హామీలన్నీ ఆయన అటకెక్కించారు. రుణాలుమాఫీ కాక, పంటలు పండక  అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ వారి కష్టాల గురించి మేం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే రైతులందరూ సుఖసంతోషాలతో ఉన్నారని చంద్రబాబు అంటున్నారు. రైతులు, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న అగచాట్లను, అవస్థలను తెలియచెప్పి, ఆయన కళ్లు తెరిపించేందుకే భరోసా యాత్ర చేస్తున్నాను. ఈ యాత్రలో రైతులు చెప్పే బాధలు వినైనా చంద్రబాబుకు బుద్ధి వస్తుందని భావిద్దాం.

చంద్రబాబు పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక్క విషయం చూద్దాం.. రాష్ట్రంలో కరువు వస్తే... వెంటనే కరువు మండలాలను ప్రకటించాల్సిన ముఖ్యమంత్రి తాత్సారం చేస్తూ వచ్చారు. తీరా అకాల వర్షాలకు వరదలు వచ్చి నెల్లూరు మునిగిపోయిన తర్వాత 162 కరువు మండలాలను ప్రకటించారు. కరువు వచ్చిన వెంటనే కరువు మండలాలను ఎందుకు ప్రకటించలేదంటే... కరువు మండలాల సహాయం కోసం కేంద్రం 50 శాతం నిధులు ఇస్తే రాష్ట్రం 50 శాతం నిధులు ఇవ్వాల్సి వస్తుందనే ఈ విధంగా జాప్యం చేశారు. ఇటువంటి చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 ఒక్క హామీనన్నా నెరవేర్చారా..?
 ఎన్నికల ముందు చంద్రబాబు అనేక వాగ్దానాలు ఇచ్చారు. ఏ టీవీ ఆన్ చేసినా ప్రకటనలతో ఊదరగొట్టారు. అర్ధరాత్రి కూడా ఆ ప్రకటనలు ప్రసారమయ్యేవి. ఏ ఊర్లో చూసినా ఫ్లెక్సీలే. ఆ ఫ్లెక్సీలకు లైట్లు పెట్టి మరీ ప్రచారం చేశారు. గోడలపై పెద్ద పెద్ద అక్షరాలతో రాతలు రాశారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని... బాబు వస్తేనే జాబు వస్తుందన్నారు.

ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిందేమిటి? ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. అందరికీ ఇళ్లు కట్టిస్తానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు... గెలిచి 20 నెలలైనా ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. ఎన్నికల ముందు రేషన్ బియ్యమన్నా కరెక్టుగా వచ్చేవి. ఇపుడు చంద్రబాబు ఆ బియ్యాన్ని ఎలా కత్తిరించాలా అని చూస్తున్నారు.

 రైతులను నట్టేట ముంచారు..
 గతంలో రైతులకు లక్ష రూపాయల వరకు వడ్డీలేని రుణాలు వచ్చేవి. లక్ష నుంచి 3 లక్షలలోపు రుణాలు పావలా వడ్డీకే లభించేవి. బాబు రుణమాఫీ హామీని నమ్మి రైతులు రుణాలు కట్టకపోవడంతో ఇప్పుడు బ్యాంకులు రైతుల రుణాలను రెన్యువల్ చేయలేదు. కొత్త రుణాలివ్వడం లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రైతులు కోల్పోయారు. అంతేకాదు రైతులు ఏకంగా 14 శాతం అపరాధ వడ్డీ కట్టాల్సి వస్తోంది. రాష్ర్టంలో మొత్తం రూ. 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు ఉండగా... వీటికి ఈ 20 నెలల్లో వడ్డీనే రూ. 20 వేల కోట్లు అయ్యింది. కానీ రైతు రుణమాఫీకి చంద్రబాబు కేవలం రూ.7,300 కోట్లు మాత్రమే ఇచ్చి ఇదే రుణమాఫీ అంటున్నారు.

ఆయన ఇచ్చిన నిధులు మూడోవంతు వడ్డీకి కూడా సరిపోవు. బంగారాలకు కూడా బ్యాంకులు నోటీసులు పంపిస్తున్నాయి. డ్వాక్రా రుణాలను కూడా చంద్రబాబు మాఫీ చేయలేదు.  మొత్తంగా చంద్రబాబు పాలన గురించి మూడు ముక్కలో చెప్పాలంటే మోసం...మోసం...మోసం. అందుకే మనందరం కలిసి పోరాడి ఈ పాలనకు చరమగీతం పాడాలి. ఒక్కటై చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపే రోజు తొందర్లోనే వస్తుందని చెబుతున్నా.’’ అని జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్ భాషా, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 నాలుగు కుటుంబాలకు పరామర్శ
 అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేదాకా పోరాటం కొనసాగిస్తామని  జగన్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో ఆయన చేపట్టిన నాల్గో విడత రైతు- చేనేత భరోసా యాత్రలో భాగంగా నాల్గోరోజు శనివారం ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో నాలుగు రైతు కుటుంబాలను పరామర్శించారు.
 
 డీఏ ఇవ్వకపోతే ఉద్యమం
 వైఎస్సార్‌టీఎఫ్ డైరీ ఆవిష్కరణలో జగన్
 అనంతపురం : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు రెండు విడతల డీఏ ఇవ్వకపోతే ప్రభుత్వంపై ఉద్యమిస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2016 డైరీని శనివారం ఆయన అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  టీచర్స్ ఫెడరేషన్ నేతలు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు