జిల్లాలోని మెట్ట ప్రాంతాలన్నీ రెండేళ్ళలో డెల్టాగా మార్పు

21 Aug, 2016 22:54 IST|Sakshi
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలోని మెట్ట ప్రాంతాలన్నీ రాబోయే రెండేళ్ళలో డెల్టాగా మార్పు చేస్తామని జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ తెలిపారు. ఆదివారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలువ పరిధిలోని అనేక గ్రామాల్లో సేద్యపునాటి సౌకర్యంతో పాటు తాగునీటి సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను పటిష్టవంతంగా పూర్తి చేస్తామని, ఎర్రకాలువ, తమ్మిలేరు పరిధిలో కూడా నీటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది డిశంబర్‌ నాటికి కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేశామని, నాటిన ప్రతీ మొక్కకూ జియోట్యాగింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని, మొక్కల పెరుగుదల తీరును ప్పటికప్పుడు పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి ప్రద్యుమ్న, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌ డీజీపీ ఎన్‌ సాంబశివరావు, వివిధ జిల్లాల కలెక్టర్లు  పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు