త్వరలో కోదాడ పోలీస్‌ డివిజన్‌

16 Sep, 2016 19:59 IST|Sakshi
త్వరలో కోదాడ పోలీస్‌ డివిజన్‌

ఎన్‌ఎస్పీ క్యాంపులోనే ఏర్పాటుకు నిర్ణయం
భవనాలు పరిశీలించిన ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి
 కోదాడ: కోదాడ పట్టణంలో పోలీస్‌ సబ్‌ డివిజన్‌ ఏర్పాటు చేసేందుకు శాఖ పరంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన కోదాడలోని ఎన్‌ఎస్పీ క్యాంపులో ఉన్న భవనాలను డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు కోసం పరిశీలించారు. క్యాంపులో ఉన్న పాత ఎమ్మార్వో కార్యాలయంలో ప్రస్తుతం ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ నడుస్తోంది. ఈ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఇందులో ఆర్డీఓ కార్యాలయాల ఏర్పాటుకు రెవిన్యూ అధికారులు ప్రతిపాధనలు సిద్ధం చేశారని తెలియడంతో ఇదే క్యాంపు ఆవరణలో రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు పక్కన ఉన్న మరో భవనాన్ని పరిశీలించారు. ఈ భవనం విశాలంగా ఉండడమే కాకుండా, పార్కింగ్‌ ఇబ్బంది లేకుండా ఉండడంతో పాటు సమీపంలో రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఉండడంతో అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన కోదాడ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. భవనాల పరిశీలన పూర్తయిందని, దీనిపై కలెక్టర్‌కు నివేదిక ఇస్తామని అనుమతులు రాగానే కార్యాలయం ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా సూర్యాపేట జిల్లాలో కొత్తగా మునగాల, తుంగతుర్తిలలో కొత్త సర్కిల్‌ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎస్పీ వెంట ఓఎస్డీ వెంకటేశ్వర్లు, సూర్యాపేట డీఎస్పీ సునీతామోహన్, కోదాడ రూరల్‌ సీఐ మధుసూదన్‌రెడ్డి, పట్టణ ఎస్‌ఐ సురేష్‌కుమార్‌ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు